చంద్రబాబు వల్లే హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

చంద్రబాబు వల్లే హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

By Srikanth Gundamalla  Published on  17 Oct 2023 1:00 PM IST
telangana elections, komatireddy venkat reddy,  chandrababu,

చంద్రబాబు వల్లే హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

తెలంగాణలో ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీలన్నీ జోరు పెంచాయి. అటు ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో వారు చేసిందేమీ లేదంటూ తిప్పికొడుతున్నారు. అలాగే జరుగుతున్న అభివృద్ధి కొనసాగింపు తమతోనే సాధ్యమని చెబుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే క్రమంలో చంద్రబాబు గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తెలంగాణలో పదేళ్లకు కారు డొక్కు పడిపోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బ్లాక్‌ లిస్టులో ఉన్న కంపెనీలకు ఇంటర్‌ పరీక్ష బాధ్యతలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లు పాలనలో ఉండి కూడా జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్‌ ఎందుకు అందించలేక పోయారని ప్రశ్నించారు. 60 ఏళ్లు పోరాడి ప్రత్యేక తెలంగాణ సాధించుకుంటే.. ఇప్పుడు ఒక్క కుటుంబం మాత్రమే రాజ్యమేలుతోందని అన్నారు. కేవలం ఒక్క రోడ్డు వేసి అభివృద్ది చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పేదల కోసం ఇళ్లు కట్టాలంటే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితులు లేవన్నారు. కానీ.. సెక్రటెరియట్‌ను మాత్రం పూర్తి చేశారని చెప్పారు. బీఆర్ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌ మేనిఫెస్టోను కాపీ కొట్టిందంటూ విమర్శలు చేశారు. తెలంగాణలో హరీశ్‌రావు, కేటీఆర్‌ తప్ప మిగతా మంత్రులంతా ఇంటికే పరిమితం అయ్యారంటూ కౌంటర్‌ వేశారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

గద్వాల, సిరిసిల్ల, సిద్దిపేటకు మాత్రమే కేసీఆర్ ముఖ్యమంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారంటూ కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే కనీసం స్పందించలేదు అనీ.. కేటీఆర్‌ మామూలు సమయంలో రోడ్డుపై కుక్కపిల్ల చనిపోయినా ట్వీట్‌ చేస్తారని అన్నారు. కానీ.. ఇప్పుడు కేటీఆర్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

అలాగే.. హైదరాబాద్‌లో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని అన్నారు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. చంద్రబాబు వల్లే హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి జరిగిందని అన్నారు. తద్వారా లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. ఆయన అరెస్ట్‌కు మద్దతుగా ఇక్కడ ఆందోళనలు చేసే హక్కు ఉంటుందని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. వారిని అడ్డుకోవడం అన్యాయమని.. తెలంగాణ పాకిస్తాన్‌లో ఉందా అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story