Telangana: అప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా లేనట్లే..
తెలంగాణలో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 5:34 AM GMTTelangana: అప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా లేనట్లే..
తెలంగాణలో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ దాదాపు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్ కూడా 55 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ఇక బీజేపీ కూడా ఏ సమయంలో అయినా తొలి జాబితా ప్రకటన చేసే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాపై చర్చ జరుగుతోంది. మరో 64 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడంపై కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం శనివారం ఢిల్లీలో జరిగింది. అయితే.. ఈ భేటీ అసంపూర్ణంగా ముగిసింది. మరోసారి అక్టోబర్ 25న సమావేశం కావాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో.. కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా మరోసారి సమావేశం తర్వాతే వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నెల 25వ తేదీన జరిగే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలోనే రెండో జాబితా అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. కాగా.. అధికారపార్టీలో టికెట్ దక్కనివారు.. ఇతర అసంతృప్తులు కాంగ్రెస్‌లో చేరనున్నారని అందుకే జాబితాను కొంత ఆలస్యం చేస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. అంతేకాదు.. సీపీఎం కోరుతున్న స్థానాలపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని తెలుస్తోంది. అధికారపార్టీ బీఆర్ఎస్ 22 బీసీలకు మాత్రమే అసెంబ్లీ టికెట్లను కేటాయించింది. దాంతో.. కాంగ్రెస్ అంతకంటే ఎక్కువ బీసీలకు టికెట్లను కేటాయించాలని ఆలోచిస్తోంది. ఇంకా ఖరారు చేయాల్సిన 64 స్థానాల్లో ప్రాధాన్యత బీసీలకే ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఈ నెల 25న జరగనున్న ఎన్నికల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఇక అసంతృప్తులను కూడా బుజ్జగించి పార్టీ గెలుపులో సహకారం అందించాలని సూచిస్తోంది అధిష్టానం. ఇంకా చాలా పదవులు ఉన్నాయని.. తొందరపడొద్దని చెబుతోంది.
పలు చోట్ల ఒకే సీటు కోసం పలువురు ఆశావహులు పోటీ పడుతున్నందున అన్ని కోణాల నుంచి ఆలోచించి విజయం సాధించే లక్ష్యంతో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉన్నదన్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. సీపీఎం సీట్ల సర్దుబాటుతో పాటు సీపీఐ కోరుతున్న సీట్లపై ప్రాథమికంగా కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చినా మరోసారి వాటితో చర్చించాల్సి ఉన్నదని, మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల ప్రజలకు విశ్వాసం ఉందని దీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. వచ్చే ఎన్నికల కోసం పకడ్బందీగా ముందుకు వెళ్తున్నామని.. అధికారం చేపడతామని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.