అధికారమే టార్గెట్.. కలిసి పనిచేద్దామంటున్న టి-కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్‌లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది.
By Srikanth Gundamalla Published on 19 July 2023 5:39 PM ISTఅధికారమే టార్గెట్.. కలిసి పనిచేద్దామంటున్న టి-కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్‌లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, పొన్నాల లక్ష్మయ్యతో పాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా కలహాలు మాని.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేద్దామని నిర్ణయానికి వచ్చారు. కర్ణాటకలో మాదిరే తెలంగాణలోనూ ఘనవిజయం సాధించాలని చర్చించారు. ఈ మేరకు ఎలా ముందుకెళ్లాలనే దానిపై సమావేశంలో చర్చించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు.
కాగా.. సమావేశం తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను ఇప్పుడే పూర్తిగా చెప్తే సీఎం కేసీఆర్ నాలుగు నెలల్లో ప్రగతి భవన్‌ను ఖాళీ చేయాల్సింది పోయి.. ఇప్పుడే వెంటనే చేస్తారని వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఏ నిర్ణయమైనా ఇక పీఏసీలో చర్చించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. కాగా.. ఎన్నికల్లో భాగంగా విడతల వారీగా బస్సు యాత్రను చేపట్టబోతున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. జిల్లాల్లో భారీ సభలు నిర్వహించనున్నట్లు కూడా తెలిపారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా..వాటిని పక్కనపెట్టి ముందుకు సాగుతామని ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 23న పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ ఉందని చెప్పారు. ఆ తర్వాత 30వ తేదీన ప్రియాంకాగాంధీ సభలో మహిళా డిక్లరేషన్ ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు అంతా స్ట్రాటజీ రోడ్డు మ్యాప్‌తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా.. వచ్చే పీఏసీ సమావేశంలో బస్సు యాత్రపై నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పేద ప్రజలకు పెద్దగా చేసిందేమీ లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. పేదల భూములను లాక్కుందని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో భావ స్వేచ్ఛ ప్రకటన లేకుండా చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను నియంత పాలన నుంచి విముక్తి చేయడం కోసం కాంగ్రెస్ నాయకులమంతా కంకణం కట్టుకున్నామని అన్నారు. ఓట్ల కోసమే దళితబంధ పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు.