ఈటల, డీకే అరుణ సహా పలువురు బీజేపీ నేతల హౌస్ అరెస్ట్
ఈటల, డీకే అరుణ సహా పలువురు బీజేపీ సీనియర్ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 20 July 2023 4:21 AM GMTఈటల, డీకే అరుణ సహా పలువురు బీజేపీ నేతల హౌస్ అరెస్ట్
తెలంగాణలో మరోసారి పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. అధికార పార్టీ బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం గ్రామంలో డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తామని బీజేపీ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులను అడ్డుకునేందుకు ప్రభుత్వం ముందస్తు అరెస్ట్‌లు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే ఈటల, డీకే అరుణ సహా పలువురు బీజేపీ సీనియర్ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
ప్రజాసమస్యలను గుర్తించటంలో భాగంగా బీజేపీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఛలో బాట సింగారం నేపథ్యంలో ఎక్కడికక్కడ బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇక, బీజేపీ ఆఫీసు ముందు రెండు ప్లాటూన్స్‌తో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజాసమస్యలను గుర్తించడంలో భాగంగా ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాలను పరిశీలిస్తామని తెలంగాణ బీజేపీ నాయకులు ప్రకటించారు. రాష్ట్రంలోని అర్హులందరికీ డబుల్‌బెడ్రూం మంజూరు చేసే వరకు బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారంతా ఛలో బాటసింగారం కార్యక్రమంలో పాల్గొనాలని బీజేపీ శ్రేణులు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. జనాలు ఎక్కువ సంఖ్యలో వస్తారన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగం బీజేపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు.
తెలంగాణ బీజేపీ నాయకుల హౌస్ అరెస్ట్‌ను కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. హౌస్ అరెస్ట్‌లు బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అని చెప్పారు. డబుల్‌బెడ్రూం ఇళ్లను చూడటానికి వెళ్తుంటే అధికార పార్టీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఇదేమైనా ఉద్యమమా? లేక తిరుగుబాటా? కేవలం ఇళ్లు చూస్తామంటే ప్రభుత్వం ఎందుకు ఉలికిపడుతోందని అన్నారు కిషన్‌రెడ్డి. కేసీఆర్ నియంతలా పాలిస్తున్నారు.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుడ్‌బై చెప్పాల్సిన అవసరముందని అన్నారు. డబుల్‌బెడ్రూం ఇళ్లను గొప్పగా నిర్మిస్తే బీజేపీ నాయకులను అడ్డుకోవడం ఎందుకు అని నిలదీశారు కిషన్‌రెడ్డి. యుద్ధం ప్రారంభమైంది.. బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్తామంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.