మహేశ్వరం టీఆర్ఎస్‌లో విభేదాలు మరోసారి గుప్పుమన్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై జీహెచ్ఎంసీ మాజీ మేయర్, టీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి సబిత మీర్‌పేటను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. చెరువులను, పాఠశాలల స్థలాలను సైతం వదలడం లేదన్నారు. మీర్పేట మంత్రాల చెరువును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నుంచి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదన్నారు. అభివృద్ధిని ఆమె గాలికొదిలేశారని అన్నారు. ఈ అరాచకాన్ని తాను చూస్తూ ఊరుకోనని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు. ఈ విషయాలపై త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలిసి ఆయన దృష్టికి తీసుకెలుతానని తీగల అన్నారు.
గత ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరుపున తీగల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ తరుపున సబితా ఇంద్రారెడ్డి పోటీ చేశారు. ఎన్నికల్లో సబిత ఇంద్రారెడ్డి విజయం సాధించారు. అనంతరం ఆమె టీఆర్ఎస్‌లో చేరడం, మంత్రి పదవి దక్కించుకోవడం జరిగింది. అప్పటి నుంచి నియోజకవర్గంలో వీరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.