పవన్ శక్తిని తోడు చేసుకుని ఏపీని నెంబర్ వన్ చేస్తా: చంద్రబాబు
ఏపీలో ఎన్నికల వేళ ప్రచారంలో జోరు అందుకున్నాయి రాజకీయ పార్టీలు.
By Srikanth Gundamalla Published on 14 April 2024 1:45 PM GMTపవన్ శక్తిని తోడు చేసుకుని ఏపీని నెంబర్ వన్ చేస్తా: చంద్రబాబు
ఏపీలో ఎన్నికల వేళ ప్రచారంలో జోరు అందుకున్నాయి రాజకీయ పార్టీలు. ఏపీలో ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రజాగళం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆట్లాడుతూ పవన్ కల్యాణ్ శక్తిని కూడదీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటానని వ్యాఖ్యానించారు.
మరోవైపు వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పైనా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా చేయాలని తాను భావించాననీ.. కానీ జగన్ వచ్చిన తర్వాత విశాఖను గంజాయికి కేంద్రంగా మార్చారని ఆరోపించారు. సీఎం జగన్ పాలను ప్రజలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. మాస్క్ అడిగిన పాపానికి ఎస్సీ డాక్టర్ సుధాకర్‌ను అవమానించి, హింసించి ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా చేశారని మండిపడ్డారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటే జగన్ ప్రభుత్వాన్ని ఓడించాల్సిందే అని చంద్రబాబు అన్నారు. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. చెత్తపై కూడా పన్ను వేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని చంద్రబాబు అన్నారు.
సీఎం జగన్ తన పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు, మూడు సార్లు బస్సు చార్జీలను పెంచారని చంద్రబాబు చెప్పారు. జగన్ తీసుకొచ్చిన ప్రతి పథకం వెనుక పెద్ద కుంభకోణం ఉందని అన్నారు. కుంభకోణాలకు పాల్పడ్డ వారిని భూస్థాపితం చేయాలని చంద్రబాబు అన్నారు. ఏపీని పెద్దస్థాయిలో అభివృద్ధి చేసేలా మేనిఫెస్టోను తీసుకొచ్చామని అన్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. అలాగే ప్రతి మహిళ అకౌంట్‌లో రూ.1500 చొప్పున ఖాతాల్లో జమ చేస్తామనీ.. తల్లికి వందనం కార్యక్రమం కింద ఏడాదికి రూ.15వేల చొప్పున ఇస్తామన్నారు. వృద్ధ్యాప్య , వితంతు పెన్షన్లను రూ.4వేల చొప్పున ఇస్తాని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.