తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ( అవినీతి నిరోధకశాఖ) అధికారులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్దకు ఈ తెల్లవారుజామున పెద్ద మొత్తంలో పోలీసులు, ఏసీబీ అధికారులు చేరుకున్నారు. దాదాపు 100 మంది ధూళిపాళ్ల నివాసానికి వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలించారు. నరేంద్ర కుమార్ ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయని ఆయనపై ఏసీబీ కేసుపెట్టింది.
సెక్షన్ 408, 409, 418, 420, 45, 471, 120బీ కింద కేసులు నమోదు చేశారు. నాన్ బెయిల్ కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. అంతేకాదు ధూళిపాళ్ల సతీమణి సీఆర్‌పీసీ సెక్షన్ 50 (2) కింద నోటీసులు జారీచేశారు. కాగా.. అధికారుల తీరుపై తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా.. ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.