ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు?: చంద్రబాబు
కర్నూలు జిల్లా గూడూరులో టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
By Srikanth Gundamalla Published on 29 April 2024 1:45 PM ISTఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు?: చంద్రబాబు
కర్నూలు జిల్లా గూడూరులో టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అధికారంలో ఉన్న వైసీపీ కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు భాగస్వామ్యం అవుతున్నారని ఆరోపించారు. ఇలా చేయడం చాలా దుర్మార్గమని చంద్రబాబు అన్నారు. పెన్షన్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నారనీ.. ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్న సందర్భంగా వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబు కాదని చంద్రబాబు అన్నారు.
ఇప్పటికే తాము ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. కానీ.. ప్రభుత్వం మాత్రం భిన్నంగా నిర్ణయం తీసుకుందని అన్నారు. ఏపీలో కావాల్సినంత ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో ఉన్నా కూడా ఎందుకు పెన్షన్ల పంపిణీని ఇంటి వద్దకే వెళ్లి చేయకూడదు అని ప్రశ్నించారు చంద్రబాబు. ఈ విషయంలో స్వయంగా ఎలక్షన్ అధికారులు చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వినే పరిస్థితుల్లో లేరని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయనీ.. వాతావరణ శాఖ అధికారులే ప్రజలను బయటకు రావొద్దని కోరుతున్నారని గుర్తు చేశారు. అలాంటి వృద్ధులు పెన్షన్ డబ్బుల కోసం ఎండలో బ్యాంకుల చుట్టూ తిరుగుతే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పెన్షన్ల కోసం తిరుగుతున్న క్రమంలో ఎవరికైనా ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. ఇక ఏపీలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలను నిర్వహించాలనీ.. తప్పుడు రాజకీయాలు చేసి నాటకాలు చేయొద్దని చంద్రబాబు మండిపడ్డారు.