వాలంటీర్లు నెలకు రూ.50వేలు సంపాదించుకునేలా చేస్తాం: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  26 March 2024 11:45 AM GMT
tdp, chandrababu, andhra pradesh elections, kuppam,

వాలంటీర్లు నెలకు రూ.50వేలు సంపాదించుకునేలా చేస్తాం: చంద్రబాబు

ఏపీలో ఎన్నికల వేళ ప్రచారం ఊపందుకుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా వైసీపీని గద్దె దింపి తాము అధికారంలోకి రావాలని భావిస్తున్నాయి. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో అక్కడి యువతతో సమావేశం అయ్యారు. సీఎం జగన్ పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువు అయ్యాయనీ.. దాంతో యువత ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సి వస్తోందని చంద్రబాబు అన్నారు. ఏదో మాట వరుసకే ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అంటూ నమ్మించారనీ.. యువతను మోసం చేశారని అన్నారు. ఐదేళ్లుగా ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదన్నారు. అయితే.. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ముందుగా ఏదో హడావుడి మాత్రమే చేస్తారని చెప్పారు. నాలెడ్జ్‌ ఎకానమిలో తెలుగు యువత అగ్రస్థానంలో ఉండాలని తాను కలలు కన్నానని చంద్రబాబు చెప్పారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 పోస్టులను వైసీపీ ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చినట్లు కావాల్సిన వారికే ఇచ్చిందని చంద్రబాబు ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం పాలనలో యువత మాత్రమే కాదే.. ఏ వర్గం ప్రజలూ సంతోషంగా లేరని చంద్రబాబు చెప్పారు. వైసీపీ నాయకులు సర్వేల నెంబర్లు మార్చి సామాన్యుల భూములు లాక్కుని అన్యాయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అంతెందుకు తననే కుప్పంలో బెదిరించారని గుర్తుచేసుకున్నారు. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో తనకూ తెలుసని చంద్రబాబు చెప్పారు. మద్యం, గంజాయిని విచ్చలవిడిగా అమ్ముతూ డబ్బు సంపాదించుకుంటున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే 100 రోజుల్లోనే జే బ్రాండ్‌ మద్యాన్ని అరికడతామని చెప్పారు. తమ కూటమిలో జెండాలు వేరు అయినా కూడా అజెండా మాత్రం ఒక్కటే అన్నారు చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధిని గాడినపెట్టి.. ఐటీని ప్రోత్సహించి యువతకు కొత్త దారి చూపించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. ఇక రాష్ట్రంలో వాలంటీర్ల పరిస్థితి కూడా అంతబాగోలేదని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు నెలకు రూ.30వేల నుంచి 50వేల రూపాయల వరకు సంపాదించుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. అందుకు తమను ప్రజలు ఆశీర్వదించాలని.. టీడీపీతో పాటు తాము బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.

Next Story