ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్.. జలగం వెంకట్రావు రాజీనామా

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా రాజీనామాల ట్రెండ్ నడుస్తోంది.

By Srikanth Gundamalla  Published on  31 Oct 2023 11:30 AM IST
brs, khammam, jalagam venkat rao, resign,

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్.. జలగం వెంకట్రావు రాజీనామా

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా రాజీనామాల ట్రెండ్ నడుస్తోంది. ఆయా పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడ్డవారు తమ పార్టీలకు గుడ్‌ బై చెబుతున్నారు. రాజీనామా లేఖలు రాస్తూ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రాజీనామా చేశారు.

రాజీనామా చేస్తూ ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ పంపారు జలగం వెంకట్రావు. అంతేకాదు.. ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు జలగం వెంకట్రావు. కాగా.. ఇప్పటికే ఢిల్లీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలగం వెంకట్రావు చేరుకున్నారు. వీరి సమక్ష్యంలో వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. గత కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు జలగం వెంకట్రావు పలుమార్లు అపాయింట్‌మెంట్‌ కోరారు. కానీ.. ఆయన నుంచి పెద్దగా స్పందన లేదు.. ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్ దొరకలేదు. దాంతో.. గులాబా పార్టీకి గుడ్‌బై చెప్పారు జలగం వెంకట్రావు. దీనికి తోడు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన బీఆర్ఎస్‌ అభ్యర్థుల జాబితాలో కూడా సీఎం కేసీఆర్‌ తనకు మొండి చేయి చూపించడంతో అసంతృప్తికి లోనయ్యారు. ఆయనకు పార్టీలో గుర్తింపు, గౌరవం లేదని భావించిన జలగం వెంకట్రావు పార్టీకి గుడ్‌బై చెప్పారు.

అయితే.. బీఆర్ఎస్‌ పార్టీ టికెట్ ఇస్తుందని ఆశలు పెట్టుకున్న తనను పట్టించుకోకపోవడంతో తన అనుచరులతో సమావేశం అయి జలగం వెంకట్రావు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా తనను సంప్రదించడంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ అయితేనే కరెక్ట్ అని హస్తం పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. జలగం సొంత గూటికి చేరుకుంటుడంపై ఆయన అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జలగం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరుతుండటంతో.. అక్కడ హస్తం పార్టీకి మరింత బలం చేకూరినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ టికెట్‌ కాంగ్రెస్‌ ఇంకా పెండింగ్‌లో ఉంచడంతో.. అది జలగం వెంకట్రావుకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Next Story