మునుగోడులో కాంగ్రెస్‌కు షాక్.. పాల్వాయి స్రవంతి రాజీనామా

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  11 Nov 2023 11:44 AM IST
congress, munugode, palvai sravanthi, resign,

మునుగోడులో కాంగ్రెస్‌కు షాక్.. పాల్వాయి స్రవంతి రాజీనామా

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. అయినా.. ఇంకా ఆయా పార్టీల్లో అసంతృప్తులు అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. టికెట్‌ ఆశించినవారికి ప్రధాన పార్టీలు మొండి చేయి చూపడంతో రాజీనామాలు చేస్తుండటం చూశాం. తాజాగా మరో నేత కూడా అలాగే చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి మునుగోడు నాయకురాలు పాల్వాయి స్రవంతి గుడ్‌బై చెప్పారు.

అయితే.. దివంగత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె.. మునుగోడు కీలక నేత పాల్వాయి స్రవంతి కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. అయితే.. పార్టీ కూడా ముందు సానుకూలంగానే స్పందించింది. మునుగోడులో అంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లేకపోవడంతో ఆమెకే టికెట్‌ ఇవ్వాలనుకున్నారు. కానీ.. అనూహ్యంగా రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి.. ఎన్నికల సమయంలో తన సొంత గూటికి చేరుకున్నారు. దాంతో.. కాంగ్రెస్‌ ఆయనకే మునుగోడు టికెట్‌ కేటాయించింది. దాంతో.. టికెట్‌ దక్కుతుందనుకున్న పాల్వాయి స్రవంతికి నిరాశ ఎదురైంది. దాంతో కొంతమేర పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేసింది.

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరు ప్రకటన రాగానే ఆమె పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. అయితే.. పాల్వాయి స్రవంతి ముందుగా ఈ వార్తలను ఖండించారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని.. పార్టీ గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. దాంతో ఆమె కాంగ్రెస్‌లో కొనసాగుతారనే అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా ఆమె తాజాగా పార్టీకి రాజీనమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె రాజీనామా నియోజకవర్గంలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే.. అతి త్వరలోనే పాల్వాయి స్రవంతి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.

ఇక గత మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి బరిలో నిలిబడ్డ విషయం తెలిసిందే. అప్పుడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోటీ చేశారు. కానీ.. ఎన్నికల్లో బీఆర్ఎస్‌ నుంచి పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలిచారు. ఈ నియోజవకర్గం నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్లనే నిలబడ్డారు.

Next Story