దుబ్బాకకు బీఆర్ఎస్, బీజేపీలు ఏం చేయలేదు: రేవంత్‌రెడ్డి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.
By Srikanth Gundamalla Published on 23 Nov 2023 6:15 PM ISTదుబ్బాకకు బీఆర్ఎస్, బీజేపీలు ఏం చేయలేదు: రేవంత్‌రెడ్డి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నాయకులు ఎవరికి వారు నియోజకవర్గాల్లో సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఈక్రమంలోనే దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి తరఫున టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం, దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని కేసీఆర్ బొందలగడ్డ తెలంగాణాగా మార్చారని అన్నారు. కేసీఆర్ బక్కోడు కాదు.. భూ బకాసూరుడు అంటూ రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. దుబ్బాకను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దుబ్బాకకు ఇవ్వాల్సిన నిధులను కూడా కేసీఆర్, హరీశ్‌రావులు కలిసి సిద్దిపేటకు తరలించుకుపోయారని ఆరోపించారు రేవంత్‌రెడ్డి. అయితే.. ఆ నిధుల కోసం చెరుకు ముత్యం రెడ్డి పోరాడారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే దుబ్బాక ప్రాంతం అభివృద్ధి చెందింది అని రేవంత్‌రెడ్డి అన్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డ ఇపేరులోనే కొత్త ఉంది తప్ప.. ఆయన పాత చింతకాయ పచ్చడే అన్నారు. దొర గడీలో ఉండే ప్రభాకర్.. దుబ్బాకను ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
మరోవైపు గత ఉపఎన్నికల్లో దుబ్బాక నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తానని.. దుబ్బాకను అభివృద్ధి చేస్తానని చెప్పి విస్మరించారని ఆరోపించారు. మూడేళ్లలో ఇచ్చిన మాటలను రఘునందన్‌రావు నిలబెట్టుకోలేకపోయాడన్నారు. మళ్లీ ఓటు అడిగేందుకు వస్తున్నాడని ప్రజలే బీఆర్ఎస్, బీజేపీలకు సరైన బుద్ధి చెప్పాలన్నారు. రఘునందన్‌రావు ఎమ్మెల్యేగా గెలిచాక రాజకీయ కుమ్ములాటల్లో బిజీగా ఉన్నారు తప్ప.. దుబ్బాక అభివృద్ధి గురించి ఏనాడూ పట్టించుకోలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. దుబ్బాక అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని.. నీతికి నిజాయితీకి మారుపేరు అయిన ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని రేవంత్‌రెడ్డి కోరారు.