తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే కాదు..బీజేపీ కూడా పోరాడింది: రాజ్‌నాథ్‌సింగ్
తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే పోరాటం చేయలేదని.. రాష్ట్ర సాధన కోసం బీజేపీ కూడా పోరాడిందని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 3:20 PM ISTతెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే కాదు..బీజేపీ కూడా పోరాడింది: రాజ్‌నాథ్‌సింగ్
తెలంగాణలో ఎన్నికల ప్రచారం హీటెక్కింది. తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. గత పదేళ్లలో తెలంగాణకు కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జమ్మికుంటలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. సభలో పాల్గొన్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాణి రుద్రమదేవి, కుమ్రంభీం లాంటి ఎంతో మంది వీరులను కన్న పుణ్యభూమి తెలంగాణ అని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. 1984లో బీజేపీ రెండు లోక్‌సభ స్థానాల్లో గెలిస్తే.. తెలంగాణ బీజేపీ నుంచి జంగారెడ్డి ఎన్నికయ్యారని గుర్తు చేశారు. అయితే.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఒక్కరే పోరాటం చేయలేదని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం బీజేపీ కూడా పోరాడిందని అన్నారు. మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని.. కానీ పదేళ్లలో తెలంగాణ ఎందుకు అభివృద్ధి చేయలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు రాజ్‌నాథ్‌సింగ్. 27 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ అధికారంలోకి ఉందన్నారు. గుజరాత్ అభివృద్ధికి రోల్‌మోడల్‌గా నిలిచిందని అన్నారు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. అయితే.. తెలంగాణలో మాత్రం కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిందని పేర్కొన్నారు. ఆయకు కుటుంబమే తొలి ప్రాధాన్యత అని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని రాజానాథ్‌సింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.
ఈ సందర్భంగా హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కేసీఆర్ స్వయంగా ప్రచారం చేసినా.. రాష్ట్రంలో అధికారపార్టీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుచేసినా ఈటల గెలిచారని చెప్పారు. తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందన్న రాజ్‌నాథ్ సింగ్.. యువతకు ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో పోటీ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేకపోతోందని.. కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందంటూ మండిపడ్డారు. దళితబంధు తీసుకొచ్చినా.. అది కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకే అందిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. తెలంగాణ ప్రజానీకం అభివృద్ధిని కోరుకుంటోందని.. తెలంగాణలో అభివృద్ధి బీజేపీతో సాధ్యం అవుతుందని.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు.