మమ్మల్ని ఎదుర్కోలేకే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం: ప్రధాని మోదీ
మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
By Srikanth Gundamalla Published on 30 April 2024 5:14 PM ISTమమ్మల్ని ఎదుర్కోలేకే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం: ప్రధాని మోదీ
మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై స్పందించారు. ఫేక్ వీడియోలు సర్క్యులేట్ కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. విపక్ష పార్టీలు సోషల్ మీడియాలో నకిలీ వీడియోలను వైరల్ చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని విపక్ష పార్టీలు ఎదుర్కోలేకపోతున్నాయని ఆయన అన్నారు. ప్రజల్లో తమ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉందనీ.. అందుకే ఏం చేయలేకే సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు.
ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా తనని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వారి అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు ఇప్పుడు నమ్మరని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తన ఫేస్ ను మార్ఫింగ్ చేసి అభ్యంతకర వీడియోలను సృష్టిస్తున్నారని చెప్పారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు జాతి ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటమని ప్రధాని మోదీ అన్నారు. ఒకవేళ బలహీన ప్రభుత్వం ఏర్పడితే అది ఎప్పుడైనా కూలిపోతుందని హెచ్చరించారు. ఆరు దశాబ్దాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ దేశ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయిందన్నారు. నీటి సరఫరా సవాళ్లను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. కానీ.. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం నీటి సరఫరాను సమర్ధంగా నిర్వహించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.