తుమ్మల, పొంగులేటి భేటి.. ఖమ్మంలో రసవత్తర రాజకీయం

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  2 Sep 2023 6:09 AM GMT
Ponguleti,  Tummala,   congress, Khammam,

తుమ్మల, పొంగులేటి భేటి.. ఖమ్మంలో రసవత్తర రాజకీయం 

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్‌ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో.. టికెట్ లభించని నాయకులు, అసంతృప్తులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కొందరు బీజేపీ వైపు చూస్తుంటే.. ఇంకొందరు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అయితే.. మూడోసారి ముచ్చటగా అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంటే.. ఎలాగైనా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రాజకీయాలు వచ్చే ఎన్నికల్లో రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయి.

ఖమ్మం జిల్లాలో గత రెండు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా కారు హవా కొనసాగినా.. ఖమ్మం లో మాత్రం ఆ పార్టీ సత్తా చాట లేకపోయింది. ఖమ్మంలో కాంగ్రెస్ పట్టు సాధించింది. ఇక ఈసారి ఖమ్మంలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ కు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరోపక్క తుమ్మల నాగేశ్వరరావు ఊహించని షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ బాట పట్టిన విసయం తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి టికెట్‌ దక్కకపోవడం.. ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నివాసం వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక అడుగు వేశారు. తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్‌లో చేరికపై తుమ్మలతో పొంగులేటి మాట్లాడారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరూ ఆత్మీయంగా హత్తుకున్నారు. అయితే.. తుమ్మల మాత్రం స్పష్టంగా కాంగ్రెస్‌లో చేరుతాననేది చెప్పలేదు. అనుచరులు, అభిమానులతో చర్చించాకే పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు. కాంగ్రెస్ నుంచి తనకు ఆహ్వానం అందిందని.. అభిమానుల అభిప్రాయం మేరకే నడుచుకుంటానని అన్నారు. తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఏ పార్టీలో ఉన్నా తుమ్మల నాగేశ్వరరావు ప్రజల కోసం చిత్త శుద్ధితో పనిచేస్తారని పొంగులేటి అన్నారు. తుమ్మలకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని కొనియాడారు. ఇప్పటికే తుమ్మలను టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కలిశారని.. తుమ్మలను కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ పద్ధతి ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌లో నేరుగా పొమ్మనకుండా పొగబెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు జరిగిన విధంగానే తుమ్మలకు కూడా బీఆర్ఎస్‌లో అవమానాలు జరిగాయని అన్నారు. అయితే.. ఈసారి ఖమ్మంలో పోరు రసవత్తరంగా ఉండబోతుందని.. కాంగ్రెస్‌ అన్ని స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేస్తుందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు.

Next Story