జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం..గుడ్‌బై చెబుదాం: పవన్ కళ్యాణ్
ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla
జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం..గుడ్‌బై చెబుదాం: పవన్ కళ్యాణ్
ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం అని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం రాబోతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతుంది. పెడనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓట్లు వేయించుకునేందుకే వైసీపీ ప్రభుత్వం పథకాలను తెస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. అమలుకు వచ్చే సరికి మాత్రం అంతా డొల్లతనమే అన్నారు. పథకాల మళ్లింపులో ఏపీదే అగ్రస్థానం అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. జాతీయ ఉపాధి పథకం కింద వచ్చిన రూ.337 కోట్లలో రూ.6.22 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగతా డబ్బులను మళ్లించారని ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్టకొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సగానికి పైగా ఉపాధి హామీ నిధులను దారి మళ్లించారని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఒక్కటిగా పోరాడాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఏపీలో చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. సభలు, సమావేశాలు పెట్టాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి వస్తుందని.. రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే కూడా వీసా తీసుకునే పరిస్థితి తీసుకొస్తారని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఓట్లు చీలిపోకూడదని మరోసారి టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు, హత్యా కేసులు పెడుతున్నారని అన్నారు. జగనన్న ఏపీకి భవిష్యత్తు కాదు.. రాష్ట్రానికి వచ్చిన విపత్తు అని పవన్ అన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలకు ఎవరి దగ్గర దేహీ అని అడుక్కునే పరిస్థితి రావొద్దని చెప్పారు. అందుకు తనని తిట్టినవారితో కూడా చేయి కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికీ ఏపీకి రాజధాని లేదు.. ఇలాగే ఉంటే ఏమయిపోతామని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని పవన్ కళ్యాణ్ కోరారు. దేవుడి ఆశీస్సులతో వైసీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టి.. రాష్ట్రాన్ని కాపాడుకుందామని పవన్ కళ్యాణ్ అన్నారు.