ఇన్‌స్టాలోకి జనసేన అధినేత ఎంట్రీ..ఫాలోవర్స్‌తో సోషల్‌మీడియా షేక్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచారు.
By Srikanth Gundamalla
ఇన్‌స్టాలోకి జనసేన అధినేత ఎంట్రీ..ఫాలోవర్స్‌తో సోషల్‌మీడియా షేక్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచారు. ఇప్పటి వరకు ఆయనకు వ్యక్తిగతంగా ట్విట్టర్ ఎకౌంట్ ఒకటే ఉంది. పార్టీ కార్యకలాపాల అప్‌డేట్ కోసం జనసేన పార్టీ పేరుతో మరో ట్విట్టర్ హ్యాండిల్ ఉంది. ఇప్పటి వరకు ట్విట్టర్ వేదికగా అభిమానులకు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉన్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా అభిమానులు, ప్రజలకు మరింత అందుబాటులో ఉండబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇస్తారని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. దాన్ని పవన్ కళ్యాణ్ నిజం చేశారు. జూలై 4న ఉదయం 11:30 గంటలకు అకౌంట్ క్రియేట్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టా అకౌంట్‌కు ఫాలోవర్స్ బీభత్సంగా పెరుగుతున్నారు. రెండు గంటల్లోనే 6లక్షలకు పైగా మంది ఫాలోవర్స్ అయ్యారు.
‘ఎలుగెత్తు.. ఎదురించు.. ఎన్నుకో.. జైహింద్ అంటూ తెరిచిన ఇన్‌స్టా ఖాతాలో ఇంకా ఆయన ఎలాంటి పోస్ట్ చేయలేదు. ప్రొఫైల్ ఫొటోగా ఆయన ఫొటో పోస్ట్ చేశారు. అయితే ఇన్‌స్టా ఖాతాలో రాజకీయాలకు సంబంధించిన పోస్టులే ఉంటాయని, సినిమాకు సంబంధించినవి పోస్ట్‌లు చేయకపోవచ్చని సమాచారం. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రజలకు, అభిమానులకు అందుబాటులో ఉండాలని భావిస్తారు. ప్రభుత్వానికి చెప్పాలనుకునేది, ప్రజలకు చెప్పాల్సింది ట్విట్టర్ అకౌంట్ల ద్వారా చెప్పేస్తారు. కానీ ప్రజలకు మరింత చేరువయ్యేందుకే పవన్ కళ్యాణ్ ఇన్‌స్టా అకౌంట్ తెరిచారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ఓ పక్క ఏపీలో రాజకీయాలు, మరో పక్క వరుస సినిమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. పవన్ చేపట్టిన వారాహి యాత్ర మొదటి విడత సక్సెస్ అయ్యింది. దీంతో రెండో విడత యాత్ర కూడా ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాల పరంగా చూస్తే.. బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నారు పవన్. ఇవన్నీ పలు దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. బ్రో సినిమా మాత్రం జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.