పటాన్‌చెరు పోరులో విజేత ఎవ‌రు.? ప్ర‌జ‌లు ఏమంటున్నారు.?

హైదరాబాద్‌ మహానగరానికి శివారు ప్రాంత‌మైన‌ పటాన్‌చెరు ప్రాంతం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైంది.

By Medi Samrat  Published on  24 Nov 2023 9:08 AM GMT
పటాన్‌చెరు పోరులో విజేత ఎవ‌రు.? ప్ర‌జ‌లు ఏమంటున్నారు.?

పటాన్‌చెరు నియోజ‌క‌వ‌ర్గం.. హైదరాబాద్‌ మహానగరానికి శివారు ప్రాంత‌మైన‌ పటాన్‌చెరు ప్రాంతం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైంది. సంగారెడ్డి జిల్లా కేంద్రం అయినప్పటికీ .. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ప‌రిధిలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గం. పటాన్ చెరు, అమీన్‌పూర్, జిన్నారం, గుమ్మడిదల, రామచంద్రపురం మండ‌ల కేంద్రాలను క‌లుపుతూ నియోజ‌క‌వ‌ర్గంగా ఏర్పాటుచేశారు. సుమారు 4 లక్షల మంది ఓటర్లు నియోజకవర్గంలో ఉన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఉపాధి పొందుతున్న కార్మికులతో ఈ నియోజ‌క‌వ‌ర్గం మినీ ఇండియాగా పేరొందింది. ఈ నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల మంది వ‌ర‌కూ కార్మికులు ఉండ‌టం విశేషం. దీంతో ఎన్నిక‌ల‌పై వీరి ప్ర‌భావం అధికం. అంతేకాదు ఇక్రిశాట్‌, బీహెచ్‌ఈఎల్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో భాగం. దీంతో విద్యావంతులు, వలస కార్మికులతో రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గంగా పేరొందింది.


పటాన్‌చెరు నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఓట్లు 3,97,237 ఉండ‌గా.. అందులో పురుషులు 2,05,045, మహిళలు 1,92,116, ఇతరులు 76 మంది ఉన్నారు. గత ఐదేళ్లలోనే ఇక్కడ ఏకంగా లక్ష మంది కొత్త ఓటర్లు నమోదవ్వ‌డం విశేషం. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం కీలకంగా మారింది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు తోడు బీఎస్పీ, సీపీఎం అభ్యర్ధులు బ‌రిలో ఉండ‌టంతో ఇక్కడ పోరు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది.

2014, 2018 ఎన్నికల్లో వ‌రుస‌గా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయ‌నే బ‌రిలో ఉన్నారు. కాంగ్రెస్ త‌ర‌పున‌ కాట శ్రీనివాస్‌గౌడ్‌, బీజేపీ అభ్యర్ధిగా నందీశ్వర్‌గౌడ్‌, బీఎస్పీ తరఫున నీలం మధు ముదిరాజ్ ప్ర‌ధానంగా బ‌రిలో ఉన్నారు.

మహిపాల్‌రెడ్డి హ్యాట్రిక్ కొట్టేనా..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన 2014, 2018 ఎన్నికల్లో గూడెం మహిపాల్‌రెడ్డి వరుసగా రెండుసార్లు గెలిచారు. ప్ర‌స్తుత‌ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాల‌ని ప్రయత్నిస్తున్నారు. ఈ నియోజకవర్గంపై పట్టున్న మంత్రి హరీశ్‌రావు కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టారు. మహిపాల్‌రెడ్డి గెలుపు బాధ్యతలను స్వయంగా తీసుకున్న హ‌రీష్‌.. ఆయన సలహాలు, సూచనల‌తో పార్టీ క్యాడర్‌ను ముందుకున‌డుపుతున్నారు. గ‌డిచిన‌ పదేళ్లలో తాను చేసిన అభివృద్ధి, ప్ర‌భుత్వ‌ సంక్షేమ కార్యక్రమాలను మహిపాల్‌రెడ్డి నేరుగా ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. బీఆర్‌ఎస్‌ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోకు తోడుగా ఆయన సొంతంగా నవరత్న హామీల పేరుతో నియోజకవర్గ ప్రజలకు హామీలు ప్రకటించారు. ఊరికో అంబులెన్స్‌, మినీ స్డేడియాలు, కమ్యూనిటీ భవనాలు, యువత చదువుకు సహాయం, పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్‌ తదితర హామీలతో ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. షెడ్యూలు వెలువడటానికి ఆరు నెలల ముందు నుంచే ఎన్నికలకు సిద్ధమవుతూ ప్రణాళిక రూపొందించుకున్నారు. గ‌త‌ జులైలో మహిపాల్‌రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూయ‌డంతో కుటుంబంలో తీవ్ర‌ విషాదం నెల‌కొంది. ఆ విషాదం నుంచి తేరుకున్న ఆయ‌న ప్ర‌చారంలో ముందుకు సాగుతున్నారు.


నందీశ్వర్‌గౌడ్ నెగ్గేనా..

నియోజకవర్గం ఏర్పాటయ్యాక తొలిసారి 2009 ఎన్నికల్లో టి.నందీశ్వర్‌గౌడ్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంత‌రం 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేసి మహిపాల్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత‌ 2017లో భారతీయ జనతా పార్టీ లో చేరారు. 2018లో బీజేపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీకి కూడా రాజీనామా చేసి 2019లో మ‌ళ్లీ బీజేపీలో చేరారు. ప్ర‌స్తుతం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించగా.. నవంబర్ 9న ఆయ‌న వివాద‌స్ప‌దంగా జేసీబీలు, బుల్డోజర్లతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నందీశ్వర్‌గౌడ్ బీజేపీ హిందుత్వ నివాదంతో పాటు బీసీ మంత్రంతో అధికార బీఆర్ఎస్ అభ్య‌ర్ధిని ఎదుర్కొనేందుకు సిద్ధ‌మ‌య్యారు. బీసీ వాదాన్ని బలంగా వినిపించే ఆయ‌న‌.. పార్టీ ప్రకటించిన బీసీ సీఎం హామీని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి సానుకూలంగా ఉండే ఉత్తరాది ఓటర్లు తనకు మద్దతు పలుకుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతంలోని విద్యావంతులు, కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువత కూడా బీజేపీ వైపే ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అవినీతి, భూ కబ్జాలకు పాల్పడ్డారని, అధికారాన్ని దుర్వినియోగం చేశారని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు ప్రచారానికి న‌టుడుగా తెలుగు వారికి సుప‌రిచితుడైన బీజేపీ ఎంపీ ర‌వి కిష‌న్ ను తీసుకొచ్చి భారీ రోడ్డు షో నిర్వ‌హించారు. వ‌చ్చే నాలుగు రోజుల్లో స్టార్‌ క్యాంపెయినర్‌ బండి సంజయ్‌, ఉత్తరాది ఓటర్లను ఆకర్షించేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆంధ్రా సెటిలర్ల ఓటర్లను ఆకట్టుకునేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను పిలిపించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.


శ్రీనివాస్ గౌడ్‌కు సానుభూతి క‌లిసొస్తుందా..

కాంగ్రెస్‌ పార్టీకి పటాన్‌చెరు నియోజకవర్గంలో బలమైన క్యాడర్‌, ఓటుబ్యాంకు ఉంది. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచి పాగా వెయ్యాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసి గ‌ట్టి పోటీ ఇచ్చిన‌ కాట శ్రీనివాస్ గౌడ్ నే మ‌రోమారు అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించింది. గ‌త ఎన్నిక‌ల‌లో అధికార పార్టీ అభ్యర్థితో ఢీ అంటే ఢీ అన్నట్లుగా తలపడిన శ్రీనివాస్ గౌడ్ 78,775 ఓట్లు సంపాదించారు. గతంలో ఓడిపోయిన సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసివ‌స్తుంద‌ని చెబుతున్నారు. గ‌త ఎన్నికల్లో రెండో స్థానంతో స‌రిపెట్టుకున్న శ్రీనివాస్ గౌడ్.. ఈసారి విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే.. టికెట్‌ విషయంలో శ్రీనివాస్‌గౌడ్‌కు అనేక అవరోధాలు ఎదురయ్యాయి. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు ముదిరాజ్‌.. టికెట్ విష‌యంలో శ్రీనివాస్‌గౌడ్‌తో పోటీ ప‌డ్డారు. చివరికి నాటకీయ పరిణామాల న‌డుమ శ్రీనివాస్‌గౌడ్‌ తిరిగి టికెట్ దక్కించుకున్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పార్టీ నేతల అవినీతి, కబ్జాలే తమ ప్రచార అస్త్రాలని శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొంటున్నారు. ఈ సారి ప‌క్కా విజ‌యం త‌మ‌దేన‌ని విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నారు.


నీలం మధు పంతం నెగ్గేనా..

నీలం మధు ముదిరాజ్.. నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ‌గా విన‌ప‌డుతున్న పేరు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీల నుంచి టికెట్‌ ఆశించి విఫ‌ల‌మ‌య్యారు. చివరికి బీఎస్పీ తరఫున బరిలోకి దిగారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులలో గుబులు మొద‌లైంది. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నీలం మధును తొలుత అధిష్లానం అభ్యర్థిగా ప్రకటించింది. అయితే.. అప్ప‌టికే సీనియ‌ర్‌గా గ‌త ఎన్నిక‌ల‌లో ఓట‌మి చ‌విచూసిన శ్రీనివాస్‌గౌడ్ అనుచ‌రులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌ల‌కు దిగ‌డంతో దిగిచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. నీలం మ‌ధును కాద‌ని శ్రీనివాస్ గౌడ్‌ను ఖ‌రారు చేసింది. దీంతో తనను మోసం చేసిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యమని మధు ప్రకటించారు. దీంతో పాటు ముదిరాజ్‌లకు అన్యాయం జరిగిందనే సామాజిక కోణాన్ని, బీఎస్పీ బహుజన వాదాన్ని వినిపిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వ్యతిరేక వర్గం ఓట్లతో విజయం సాధిస్తానని మధు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


పోటీలో సీపీఎం అభ్య‌ర్ధి కూడా..

కాంగ్రెస్‌తో పొత్తు ప్రయత్నాలు విఫలం కావడంతో సీపీఎం కూడా అభ్యర్థిని నిలబెట్టింది. ట్రేడ్‌ యూనియన్‌ రాజకీయాల్లో సీనియర్‌ అయిన జొన్నలగడ్డ మల్లికార్జున్ సీపీఎం తరఫున పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కువ‌గా కార్మికులు పనిచేస్తుండడంతో.. వారి సమస్యలే ఎజెండాగా ప్రచారం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక అయిన సీపీఎంకు పట్టం కట్టాలని ఆయ‌న పిలుపునిస్తున్నారు. ప్రజా సమస్యలపై, కార్మిక వర్గ సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా ఉండే అభ్యర్థిని ఓటు ద్వారా ఎన్నుకోవాలని.. కమ్యూనిస్టులు బలహీనపడితే ప్రజలకు, శ్రామిక వర్గానికి ఎంతో మంచి జరుగుతుందని ఓట్లు అభ్య‌ర్ధిస్తున్నారు.


ప్ర‌జ‌లు ఏమంటున్నారు..

న‌రేంద‌ర్ (రిటైర్డ్ ఉద్యోగి) : తెలంగాణ రావ‌డానికి కార‌ణ‌మైన బీఆర్ఎస్ వైపే నేనుంటాను. ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న బాగుంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావాల‌ని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో మ‌రోమారు బీఆర్ఎస్ అధికారంలోకి రావాల‌న్న‌ది నా అభిప్రాయం. ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ల మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ ఉన్నా.. మ‌రోమారు బీఆర్ఎస్ అభ్య‌ర్ధి మ‌హిపాల్ రెడ్డికే ఇక్క‌డి జ‌నం ప‌ట్టం క‌డుతార‌ని అనుకుంటున్నాను.

శ్రీనివాస్‌(రోజు కూలీ) : తెలంగాణ ఉద్య‌మం నాటి నుంచి నేను టీఆర్ఎస్ ప‌క్షానే ఉన్నాను. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు బాగున్నాయి. మా ఇంట్లో మా అమ్మ‌, నాన్న‌ల‌కు ఫించ‌న్ వ‌స్తోంది. ఇళ్లు లేని వారికి ప‌ట్టాలు ఇస్తామంటున్నారు. నీటికి ఎటువంటి ఇబ్బంది లేదు. మ‌హిపాల్ రెడ్డి ప‌నితీరు బాగుంది. బీజేపీ ప్ర‌భావం ఇక్క‌డ అంత‌గా లేదు. కాంగ్రెస్ గెలుస్తుంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు.. కానీ ఇక్క‌డ బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయం.

న‌రేష్(సాప్ట్‌వేర్ ఇంజ‌నీర్‌) : బీఆర్ఎస్‌కు రెండుసార్లు అవ‌కాశ‌మొచ్చింది. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోలేక‌పోయారు. హైద‌ర‌బాద్ డెవ‌ల‌ప్ మెంట్ అంటున్నారు.. చంద్ర‌బాబు హ‌యాంలోనే ఐటీ కంపెనీలు వ‌చ్చాయి.. కేసీఆర్, కేటీఆర్‌ కొత్త‌గా తెచ్చిన‌వి ఏమీ లేదు. చంద్ర‌బాబు చెట్లు నాటితే.. వీరు ఫ‌లాలు తింటున్నారు. అంతేకానీ బీఆర్ఎస్ ఏం చేయ‌లేదు. వారి వ‌ల్ల తెలంగాణ రాలేదు. శ్రీకాంత చారి లాంటి అమ‌ర‌వీరుల ఆశ‌యాలు నెర‌వేలేదు. కేసీఆర్‌ కుటుంబంలో మాత్ర‌మే అంద‌రికి కొలువులు ఉన్నాయి. కానీ తెలంగాణ‌కు ఒరిగిందేమి లేదు. నిరుద్యోగుల‌కు ఎంత అన్యాయం జ‌రిగింద‌నేది నాలాంటి వాళ్ల‌కు మాత్ర‌మే తెలుస్తుంది. పటాన్‌చెరు నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తే మ‌హిపాల్ రెడ్డి ప‌నితీరు బాగుంది. బీజేపీకి సరైన క్యాడ‌ర్ లేక‌పోవ‌డం మైన‌స్‌. అంత‌గా బీజేపీ ప్ర‌భావం ఉండ‌దు. నీలం మ‌ధు, శ్రీనివాస్ గౌడ్‌లు మ‌హిపాల్ రెడ్డికి గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశం ఉంది. అయినా మూడోసారి మ‌హిపాల్ రెడ్డి గెలిచే ఛాన్స్ ఉంది. కానీ రాష్ట్రంలో మాత్రం అధికారం ఛేంజ్ అవ్వాల‌నేది నా అభిప్రాయం.

శ్రీరాములు(కాంట్రాక్ట‌ర్‌) : తొలి నుంచి నాది కాంగ్రెస్‌. బీఆర్ఎస్ నుంచి ప‌దేళ్ల‌లో ఏ ప‌నులు కాలేదు. ఎమ్మెల్యేపై క‌బ్జా ఆరోప‌ణ‌లు బాగా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్య‌ర్ధి కాటా శ్రీనివాస్ గౌడ్‌ గెల‌వాల‌న‌న్న‌ది నా అభిప్రాయం.

న‌ర్సింహ‌(ఆటోడ్రైవ‌ర్‌) : గ‌రీబోనికి న్యాయం జ‌రిగే ప‌రిస్థితి లేదు. గ‌తంలో బీఆర్ఎస్ ప‌క్షానే ఉన్నాం. కానీ ఈసారికి మా ప‌క్షాన నిలిచే అభ్య‌ర్ధికి మా ఓటు వేయాల‌నుకుంటున్నాం. ఉన్నోళ్ల‌కే ప‌థ‌కాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుత ప్ర‌భుత్వంలో నాయ‌కుల అనుచ‌రుల‌కే ప‌థ‌కాలు దక్కుతున్నాయి. మా లాంటి వారికి భ‌రోసా ఇచ్చే అభ్య‌ర్ధి ప‌క్షాన నిల‌వాల‌నుకుంటున్నాం.


Next Story