ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 23 Dec 2023 2:46 AM GMTఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాకపోయినా అప్పుడే హడావుడి మొదలైపోయింది. మరోసారి అధికారం చేపట్టాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. ఎలాగైనా వైసీపీని గద్దె దించి తాము అధికారంలో రావాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తు కూడా ఉంటుందని ప్రకటించాయి. ఓట్లు చీలకూడదు అనే లక్ష్యంతోనే తాము ఉమ్మడిగా పోటీ చేసేందుకు సిద్ధం అయినట్లు తెలిపాయి. మరోవైపు అధికార పార్టీ వైసీపీ వైనాట్175 టార్గెట్‌తో ఎన్నికలకు సమయాత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు అయ్యింది.
ఏపీలో ఇప్పటికే తెలుగు సేన పార్టీతో ఒక కొత్త పార్టీ రాగా.. తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా కొత్త ప్రకటించారు. అయితే ఇప్పటికే ఏపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలుగా వైసీపీ, టీడీపీ, జనసేన ఉండగా.. కాంగ్రెస్, బీజేపీలు కూడా బరిలో దిగుతాయి. వీటికి తోడు మేం కూడా బరిలోకి దిగుతామంటూ కొత్త రాజకీయ పార్టీలు పురుడుపోసకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నిర్మాత సత్యారెడ్డి కొత్త పార్టీ పెట్టారు. 'తెలుగు సేన పార్టీ' పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అయితే.. ఆయన పార్టీని ప్రకటించిన కొన్ని గంటలకే మరో కొత్త పార్టీ కూడా పుట్టింది. ఆ కొత్త పార్టీ పేరే 'జై భారత్ నేషనల్'. దీన్ని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్థాపించారు.
శుక్రవారం విజయవాడలో జై భారత్ నేషనల్ పార్టీని ప్రకటించారు మాజీ జేడీ లక్ష్మీనారాయణ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడే నిరుద్యోగానికి ప్రధాన కారణమని ఆయన చెప్పారు.. దానిని తీసుకొచ్చేందుకే భారత్ నేషనల్ పార్టీ పుట్టిందని ప్రకటించారు. గత ఎన్నికల్లో పోటీ తర్వాత మరింత స్ఫూర్తితో తాను పనిచేశానని అన్నారు లక్ష్మీనారాయణ. అన్ని వర్గాల ప్రజలను కలిసి అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలిపారు. రాజకీయాలు అంటే మోసం కాదనీ.. సుపరిపాలన అని పేర్కొన్నారు. వీళ్లు తిన్నారనీ వాళ్లు.. వాళ్లు తిన్నారని వీళ్లు విమర్శలే సరిపోతున్నాయని ప్రస్తుత రాజకీయ పార్టీలపై విమర్శలు చేశారు. ఎవరూ అవినీతికి పాల్పడలేని వ్యవస్థను స్థాపించేందుకు తాను పార్టీని పెట్టినట్లు చెప్పారు. అభివృద్ధితో అవసరాలు తీరుస్తామని.. జై భారత్ నేషనల్ పార్టీ’ బానిసత్వాన్ని రూపుమాపుతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు.