మీరు చొక్కా మడతపెడితే.. మేం కుర్చీ మడతపెడతాం: నారా లోకేశ్

వైసీపీ నాయకులు చొక్కాలు మడతపెడితే.. మేం కుర్చీలు మడతపెడతామని అన్నారు నారా లోకేశ్.

By Srikanth Gundamalla  Published on  16 Feb 2024 3:00 PM IST
nara lokesh, comments,  cm jagan, ycp, andhra pradesh ,

మీరు చొక్కా మడతపెడితే.. మేం కుర్చీ మడతపెడతాం: నారా లోకేశ్

విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ ఆధ్వర్యంలో శంఖారావం సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు చొక్కాలు మడతపెడితే.. మేం కుర్చీలు మడతపెడతామని అన్నారు. మీకు సీటు లేకుండా చేస్తామంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఎలా చేస్తామో చూపించాలా అంటూ.. స్టేజిపై ఉన్న కుర్చీని చేతులతో పైకి ఎత్తి మరి మడతపెట్టి చూపించారు నారా లోకేశ్.

పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే అస్సలు ఊరుకునేది లేదని నారా లోకేశ్ అన్నారు. రాజధాని ఫైల్స్ సినిమా, రైతులు అంటేనే సీఎం జగన్ భయపడిపోతున్నారని అన్నారు. ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్దకు పోలీసులను పంపిస్తున్నారని చెప్పారు. ఇక అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ మూడు రాజధానులు అంటూ మాటలు చెప్పారని విమర్శించారు. ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు ఒక్క ఇటుకైనా వేశారా అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందని మండిపడ్డారు నారా లోకేశ్. ఈ ప్రభుత్వం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నానీ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వారే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించారని అన్నారు. మద్యపాన నిషేదం చేస్తామని.. అది అమలు చేశాకే ఓటు అడుగుతామని మాట్లాడారని గుర్తు చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి ఇంకెప్పుడు మద్యపాన నిషేధం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు దీనిపై ఏం సమాధానం చెప్తారని అన్నారు. ఐదేళ్లుగా విద్యుత్, ఆర్టీసీ చార్జీలను పెంచుతూనే ఉన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వలేదు.. నిరుద్యోగులను మోసం చేసింది. ఇలా అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతూనే ఉందంటూ లోకేశ్ చెప్పుకొచ్చారరు. ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద హామీలిచ్చి.. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని నారా లోకేశ్ అన్నారు.


Next Story