చంద్రబాబుని అంతమొందించే కుట్ర జరుగుతోంది: నారా లోకేశ్
అనారోగ్య కారణాలతో టీడీపీ అధినేత చంద్రబాబుని అంతమొందించే కుట్ర చేస్తున్నారని నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 12:19 PM ISTచంద్రబాబుని అంతమొందించే కుట్ర జరుగుతోంది: నారా లోకేశ్
అనారోగ్య కారణాలతో టీడీపీ అధినేత చంద్రబాబుని అంతమొందించే కుట్ర చేస్తున్నారని నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ.. రిమాండ్‌లోనే ఉంచాలని చూస్తున్నారని అన్నారు. అయితే.. జ్యుడిషియల్ రిమాండ్ ఉన్న చంద్రబాబుని ముద్దాయి అని హెల్త్ బులెటిన్‌లో పదే పదే పేర్కొనేందుకు పెట్టిన శ్రద్ధ ఆయన ఆరోగ్యం, భద్రతపై మాత్రం పెట్టడం లేదని ప్రభుత్వ యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి.. ఆయనకు ప్రాణహాని తలపెడుతున్నారంటూ నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు.
చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని.. వైసీపీ ప్రభుత్వం కావాలనే ఆయన పట్ల రాజకీయ కక్షతో రాక్షసంగా వ్యవహరిస్తోందని నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహంగా ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు జీవితం ప్రమాదంలో ఉందని.. చంద్రబాబు ఆరోగ్యంపై ఎందుకీ కక్ష అంటూ ప్రశ్నించారు. దోమలు ఉన్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదనీ.. సరిగా తిరగని ఫ్యాన్ పెట్టారంటూ విమర్శించారు. చంద్రబాబు బరువు తగ్గిపోయారనీ.. అలర్జీ వచ్చిందనీ.. డిహైడ్రేషన్‌కు గురయ్యారని నారా లోకేశ్ తెలిపారు. జైలు పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు నారా లోకేశ్ పేర్కొన్నారు. అయితే.. చంద్రబాబుకి ఏ హాని జరిగినా.. సైకో జగన్ సర్కారు..రాజమండ్రి జైలు అధికారులదే బాధ్యత అని నారా లోకేశ్ అన్నారు.
కాగా.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చారు. ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి లోకేశ్ నేరుగా రాజమండ్రి జైలకు బయల్దేరారు. చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదని ఇప్పటికే నారా భువనేశ్వరితో పాటు.. ఇతర టీడీపీ ముఖ్యనేతలు చెబుతున్న విషయం తెలిసిందే. అచ్చెన్నాయుడు అయితే.. చంద్రబాబుకి స్టెరాయిడ్స్ ఇచ్చి ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అయితే.. రాజమండ్రిలో టీడీపీ ముఖ్యనేతలతో లోకేశ్ భేటీ అవుతారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.