పవన్ కళ్యాణ్ ఊసరవెళ్లి అన్న ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై మండిపడ్డ నాగబాబు
Naga Babu gives strong counter to Prakash Raj .. జీహెచ్ఎంసీ( గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) ఎన్నికల్లో
By సుభాష్ Published on 28 Nov 2020 7:13 AM GMTజీహెచ్ఎంసీ( గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) ఎన్నికల్లో తొలుతు పోటీ చేస్తామని చెప్పిన జనసేన పార్టీ తరువాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించి.. తన కార్యకర్తలను, అభిమానులను ఆ పార్టీకి ఓటు వేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ పూటకో మాట మార్చే ఊసరవెళ్లి అని ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభిమానులు కార్యకర్తలకు బీజేపీకి ఓటేయ్యాలని చెబితే ఇక జనసేన పార్టీ ఎందుకని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌కు ఏమైందో నిజంగా నాకు అర్థం కావట్లేదని ప్రకాశ్ రాజ్ అన్నారు. 'నువ్వొక లీడర్.. మీకొక పార్టీ ఉంది.. మళ్లీ ఇంకో నాయకుడి వైపు వేలు చూపించడం ఏంటి? ఏపీలో గాని ఇంకో చోట గాని.. జనసేన ఓట్ షేర్ ఎంత.. బీజేపీ ఓటు షేర్ ఏంటి? 2014లో మీరే బీజేపీ వాళ్లు అద్భుతం ఇంద్రుడు చంద్రుడు అన్నారు. మళ్లీ గత ఎన్నికల్లో లేదు వాళ్లు ద్రోహులు అన్నారు! మళ్లీ ఇప్పుడు వీళ్లే నాయకులుగా కనిపిస్తున్నారు అంటున్నారు. అంటే ఇలా మూడు నాలుగు సార్లు మారుతున్నారంటే.. మీరు ఊసరవెల్లి అయి ఉండాలి కదా..' అని విమర్శించారు.
ప్రకాశ్‌రాజ్ పై నాగబాబు ఫైర్..
ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు. ప్రకాశ్ రాజ్ చరిత్ర ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చెప్పారని గుర్తుచేస్తూ ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో నిర్ణయాలు పలుమార్లు మారుతుంటాయి.. బట్ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం లాంగ్ టర్మ్‌లో పార్టీకి, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఉంటాయని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ నాయకుడు పవన్ బీజేపీకి మద్దతు తెలపడం వెనక విస్తృత ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలిన వాడు విమర్శిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ డిబేట్‌లో సుబ్రహ్మణ్యస్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడడం తనకింకా గుర్తుందని అన్నారు. బీజేపీ విధానాలు నచ్చకపోతే విమర్శించడంలో తప్పులేదని, కానీ మంచి చేస్తే మెచ్చుకోలేని కుసంస్కారం గురించి ఏం చెప్పగలమని నాగబాబు తెలిపారు.
దేశానికి బీజేపీ, ఏపీకి జనసేన వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రకాశ్ రాజ్ లాంటి మేధావులు ఎన్ని వాగినా బీజేపీ, జనసేన విజయాన్ని ఆపలేరన్నారు. బీజేపీని ఎంతగా విమర్శిస్తున్నా, ఆ పార్టీ తిరిగి ఏమీ అనడం లేదంటే ప్రజాస్వామ్యానికి బీజేపీ ఇచ్చే విలువ ఏంటో అర్థం చేసుకోవాలని ప్రకాశ్‌రాజ్‌కు హితవు పలికారు. నిర్మాతలను డబ్బుల కోసం హింసించిన సంగతి, డేట్స్ ఇచ్చి రద్దు చేసిన సంగతి అన్నీ గుర్తున్నాయని ఎద్దేవా చేశారు. పవన్ గురించి ఈసారి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని నాగబాబు హెచ్చరించారు.