బీఆర్ఎస్‌కు మైనంపల్లి రాజీనామా.. ఆయన దారెటు..?
మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
By Srikanth Gundamalla Published on 23 Sep 2023 1:38 AM GMTబీఆర్ఎస్‌కు మైనంపల్లి రాజీనామా.. ఆయన దారెటు..?
మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక వీడియో విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించాక మైనంపల్లి అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు టికెట్ లభించినా కూడా.. తన కుమారుడికి కూడా అసెంబ్లీ టికెట్ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. మెదక్‌లో తన కుమారుడు రోహిత్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. టికెట్ ఇవ్వకుంటే రోహిత్‌ను మెదక్‌లో స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేయిస్తానని చెప్పుకొచ్చాడు. మెదక్‌లో మంత్రి హరీశ్‌రావు పెత్తనం చెలాయిస్తున్నారని.. ఇక్కడికి ఆయన ఎందుకు వస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి హరీశ్‌రావు. కేసీఆర్ కుటుంబానికే అన్ని పదవులు ఏంటని ప్రశ్నించారు. మంత్రి హరీశ్‌రావు చేసిన అవినీతి గురించి తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధిష్టానం కూడా టికెట్ ఇవ్వబోమని స్పష్టమైన వైఖరితో ఉండటంతో ఎట్టకేలకు బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రకటించారు.
ప్రజలకు సేవ చేయడానికి తన కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని మైనంపల్లి తెలిపారు. మల్కాజిగిరి ప్రజలు, కార్యకర్తల కోరిక మేరకే బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు వీడియోలో తెలిపారు మైనంపల్లి. తప్పకుండా తగిన సమయంలో ఏ పార్టీలో చేరేది తెలియజేస్తానని అన్నారు. ఇంతవరకు అందరూ అందించిన సహకారానికి ప్రాణం ఉన్నంత వరకూ మర్చిపోనని అన్నారు మైనంపల్లి. మల్కాజిగిరి ప్రజలకు రాష్ట్రంలోని తన శ్రేయోభిలాషులకు అండగా ఉంటానని అన్నారు. ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తానని.. దేనికీ లొంగే ప్రసక్తే లేదని మైనంపల్లి హన్మంతరావు వీడియోలో చెప్పుకొచ్చారు.
కొద్దిరోజుల నుంచి బీఆర్ఎస్ మెదక్ టికెట్ కోసం మైనంపల్లి ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ మాత్రం సరైన నిర్ణయం రాకపోవడంతోనే పార్టీ మారేందుకు మైనంపల్లి సిద్ధం అయ్యారు. తనకు కాంగ్రెస్ పార్టీనే సరైనది అని హన్మంతరావు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు నాయకులు కూడా మైనంపల్లిని ఆ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో చేరితే తనకు మల్కాజిగిరి నుంచి.. తన కుమారుడు రోహిత్‌కు మెదక్ నుంచి అసెంబ్లీ టికెట్ లభిస్తుందని మైనంపల్లి భావిస్తున్నారు. ఈ రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్‌లో చేరే అంశంపై మార్గం సుగమం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మైనంపల్లి, వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరితే ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపునకు అవకాశాలు తక్కువే అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారుఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక వీడియో విడుదల చేశారు pic.twitter.com/VA7coBoIxq
— Newsmeter Telugu (@NewsmeterTelugu) September 23, 2023