కాంగ్రెస్‌కు జైకొట్టిన మైనంపల్లి..27న పార్టీలో చేరతానని ప్రకటన

ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రకటించారు.

By Srikanth Gundamalla  Published on  25 Sep 2023 6:36 AM GMT
Mynampally, Joining in Congress, Delhi, September 27th,

కాంగ్రెస్‌కు జైకొట్టిన మైనంపల్లి..27న పార్టీలో చేరతానని ప్రకటన

ఎన్నికల ముందు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం సహజం. ఇక నాయకులు పార్టీలు మారడం కూడా జరుగుతుంటాయి. అధిష్టానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వారిని మరోపార్టీ చేరదీసి టికెట్‌ను కేటాయిస్తుంది. తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో హీట్ మొదలైంది. బీఆర్ఎస్‌ నుంచి టికెట్‌ దక్కని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గత కొన్నాళ్లుగా అధిష్టానంపై విమర్శలు చేశారు. ఇటీవల పార్టీకి రాజీనామా చేస్తూ లేఖ కూడా రాశారు. అయితే.. కాంగ్రెస్‌ నాయకులు మైనంపల్లిని పలుమార్లు కలిశారు. పార్టీలో చేరాలని ఆహ్వానించారు.

అయితే.. మల్కాజిగిరి నుంచి సిట్టింగ్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లికి అధిష్టానం మరోసారి అవకాశం కల్పించింది. మైనంపల్లి మాత్రం సంతృప్తి చెందలేదు. తనతో పాటు తన కుమారుడికి కూడా టికెట్‌ ఇవ్వాలని పట్టుబట్టాడు. టికెట్ ఇవ్వకపోతే ఇద్దరూ కలిసి స్వతంత్రులుగా అయినా పోటీ చేస్తామని చెప్పాడు. ఈ క్రమంలో తన కుమారుడు రోహిత్‌రెడ్డికి టికెట్‌ దక్కకపోవడానికి మంత్రి హరీశ్‌రావే కారణమంటూ ఆయనపై తీవ్రంగా ఆరోపణలు చేశారు. మెదక్‌లో హరీశ్‌రావుకి ఏం పని అంటూ మండిపడ్డారు. అంతేకాదు.. అవినీతి చేశారంటూ పలు ఆరోపణలు చేశారు. దాంతో.. బీఆర్ఎస్‌ అధిష్టానం కూడా మైనంపల్లిని కాస్త పక్కకు పెట్టినట్లుగానే వ్యవహరించింది. పోటీ చేయాలనుకుంటే చేయచ్చు లేదంటే.. మైనంపల్లి ఇష్టం అంటూ వదిలేసింది. కానీ.. ఆయన కుమారుడికి మాత్రం టికెట్‌ ఇస్తామని ఎక్కడా ప్రస్తావించలేదు.

దాంతో మైనంపల్లి హన్మంతరావు కొన్నాళ్లు వెయిట్ చేశారు. కానీ.. పార్టీ నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో చివరకు పార్టీకి రాజీనామా చేశారు. ఇక అంతకు ముందు నుంచే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లిని తరచూ కలిశారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే.. మైనంపల్లి తనతో పాటు తన కుమారుడికి కూడా అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలుస్తోంది. దానికి కాంగ్రెస్‌ అధిష్టానం ఒకే చెప్పిందనే సమాచారం అందుతోంది. దాంతో.. పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు మైనంపల్లి. ఢిల్లీ వెళ్లి ఖర్గే సమంలో హస్తం కండువా కప్పుకుంటానని అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనని కలిశారని మరోసారి స్పష్టం చేశారు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. ఏదీ ఏమైనా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ పెద్దల సమక్షంలో హస్తం కండువా కప్పుకుంటున్నట్లు చెప్పారు. అయితే.. ఈ నెల 27వ తేదీ వరకు మంచి రోజులు ఉన్నాయని.. ఆలోపు ఢిల్లీ వెళ్లి పార్టీలో చేరతానని అన్నారు. మెదక్‌లో తన కుమారుడికి మంచి ఆదరణ ఉందని అన్నారు. తమ కార్యకర్తలను కాపాడుకునేందకు కృషి చేస్తున్నట్లు మైనంపల్లి హన్మంతరావు చెప్పారు. కాగా.. సర్వేలో అనుకూలంగా ఉంటే ఇద్దరికీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు చెప్పినట్లు మైనంపల్లి వివరించారు.

Next Story