త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్లు ఎంపీ మాగుంట ప్రకటన
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 11 March 2024 1:00 PM ISTత్వరలోనే టీడీపీలో చేరుతున్నట్లు ఎంపీ మాగుంట ప్రకటన
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తూ.. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇక కొందరు నాయకులు తాము ఉన్న పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ గుడ్‌బై చెబుతున్నారు. ఇటీవల వైసీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
అయితే.. తాజాగా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కీలక ప్రకటన చేశారు. టీడీపీలో చేరేందుకు తమ కుటుంబం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన మాగుంట శ్రీనివాసులు.. తమ అబ్బాయి రాఘవరెడ్డితో కలిసి టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అయితే.. ఈ రోజు టీడీపీలో చేరుతామనేది త్వరలోనే చెప్తానని అన్నారు. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత టీడీపీలో చేరిక తేదీపై క్లారిటీ ఇస్తామని మాగుంట శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. మాగుంట రాఘవరెడ్డి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబుని కోరినట్లు చెప్పారు. మాగుంట రాఘవరెడ్డిని ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారని ఆశిస్తున్నట్లు ఈ మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి చెప్పారు.
పొత్తుల విషయంపై మాట్లాడిన మాగుంట శ్రీనివాసులు.. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ముందుకు వెళ్లడం అద్బుతమని అన్నారు. కూటమి సక్సెస్ ఫుల్‌గా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు పార్టీల నేతలు కలిసి పని చేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామనిచెప్పారు. సోమవారం ఉదయం పలువురు టీడీపీ నేతలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారికి మాగుంట అల్పాహార విందు ఇచ్చారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాగుంట శ్రీనివాసులురెడ్డి ఈ విషయాలను వెల్లడించారు.
నేడు ఒంగోలు లో మాగుంట కార్యాలయం లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని మరియు యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఒంగోలు మాజీ శాసన సభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, గిద్దలూరు… pic.twitter.com/3HxtBUyfKT
— Magunta Sreenivasulu Reddy (@magunta_msr) March 11, 2024