రేవంత్‌ చెప్పింది చెల్లదు..సీనియర్‌గా నేను చెప్తున్నా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదన్న రేవంత్‌ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  11 July 2023 3:18 PM IST
MP KomatiReddy, Revanth Comments, Congress,

రేవంత్‌ చెప్పింది చెల్లదు..సీనియర్‌గా నేను చెప్తున్నా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తెలంగాణలో రైతులకు ఉచిత కరెంటు అవసరం లేదన్నారు రేవంత్‌. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని.. వారికి 3 గంటల ఉచిత కరెంటు ఇస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారు. దాంతో.. రేవంత్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు. రేవంత్‌రెడ్డి చెప్పినంత మాత్రాన అది ఫైనల్‌ అయిపోదని అన్నారు. అయినా రేవంత్‌రెడ్డి ఏ సందర్భంలో అలా మాట్లాడారో కూడా చూడాలని అన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కాంగ్రెస్‌కు జాతీయ సిద్ధాంతం ఉందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాపెయినర్‌గా తాను చెబుతున్నానని.. తెలంగాణలో 24 గంటల ఉచిత ఉంటుందని స్పష్టం చేశారు. అసలు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని మేనిఫెస్టో పెట్టి ఏడు గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌ అని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌ హయాంలో తామే రైతులకు ఉచిత విద్యుత్ తీసుకొచచామని.. అలాంటిది తామెందుకు ఉచిత విద్యుత్‌ను ఆపేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

అనవసరంగా బీఆర్ఎస్‌ నాయకులు కూడా దీనిపై రాద్దాంతం చేయొద్దని అన్నారు. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్‌ను కచ్చితంగా మేనిఫెస్టోలో పెడతామని తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్‌ అవసరం లేదని.. 3 గంటలు సరిపోతుందని రేవంత్‌ చెప్పినట్లు ప్రచారం చేయడం ఇక మానుకోవాలని హితవు పలికారు. రేవంత్‌రెడ్డి చెప్పినంత మాత్రాన అది జరిగిపోదని అన్నారు. లక్షలాది మంది కార్యకర్తలు అంతా కలిస్తేనే కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పారు. రేవంత్‌ వంటి నేతలు అందరం కో-ఆర్డినేటర్లమని చెప్పారు కోమటిరెడ్డి.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనేది కూడా అధిష్టానం నిర్ణయిస్తుందని ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.

Next Story