టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారబోతున్నారంటూ ఆదివారం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. విజయవాడలోని కేశినేని భవన్‌లో చంద్రబాబు ఫొటో పాటు పార్టీలోని మరికొందరు ముఖ్యనేతల ఫొటోలను తొలగించారని వస్తున్న వార్తలను కేశినేని భవన్ ఖండించింది. ఎంపీ కేశినేని నాని సన్నిహితుడు టీడీపి నేత ఫతావుల్లా ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చేశారు. కేశినేని భవన్‌లో చంద్రబాబు ఫ్లెక్సీలను తొలగించలేదని, ఒక చోట రతన్ టాటాతో నాని ఉన్న పోటో మాత్రమే అదనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
టాటా ట్రస్ట్ ద్వారా విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రతన్ టాటా విస్తృతంగా సేవలందించారని.. అందుకు కృతజ్ఞతగా, ఆ సేవల్ని మరింత విస్తృతం చేయాలన్న ఉద్దేశంతోనే ఆ ఫోటోను పెట్టడం జరిగిందన్నారు. కావాలనే కొందరు నాని పార్టీ మారుతారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కారాలయ్యం బయట నలభై అడుగుల ఎత్తైన చంద్రబాబు, ఎన్టీఆర్ చిత్రాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బీజేపీ ఓ మునిపోయే పడవ అని.. ఆ పార్టీతో మా నాయకుడు ఎలాంటి చర్చలు జరపడం లేదన్నారు. ఇక పార్టీ కార్యక్రమాలకు ఎక్కడా దూరంగా లేరని.. ఇటీవల తిరువూరు, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు.