నాకు అందుకే టికెట్‌ ఇవ్వలేదు..BRSపై రేఖానాయక్ గుస్సా

బీఆర్ఎస్‌ నుంచి తనకు టికెట్‌ దక్కకపోవడంపై ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  22 Aug 2023 10:29 AM IST
MLA Rekha Nayak, unsatisfied, BRS, No ticket,

నాకు అందుకే టికెట్‌ ఇవ్వలేదు..BRSపై రేఖానాయక్ గుస్సా

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్డాయి. మూడు నెలల సమయం మాత్రమే ఉంది. దాంతో.. అధికార పార్టీ బీఆర్ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ ఎన్నికలకు 95 శాతం మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం కల్పించారు. ఏడుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మాత్రం అదిష్టానం షాక్‌ ఇచ్చింది. ఈ క్రమంలో వీరిలో కొందరు బీఆర్ఎస్‌ అధినాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టికెట్‌ దక్కనివారిలో ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ కూడా ఉన్నారు. అయితే.. తనకు టికెట్‌ దక్కకపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచానని.. మూడోసారి కూడా గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే తనకు టికెట్‌ ఇవ్వలేని ఎమ్మెల్యే రేఖానాయక్‌ బీఆర్ఎస్‌పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సారి తనకు బదులుగా ఖానాపూర్ బీఆర్ఎస్‌ అభ్యర్థిగా జాన్సన్‌ నాయక్‌ను ప్రకటించారు. జాన్సన్‌ నాయక్‌పై రేఖానాయక్‌ ఆరోపణలు చేశారు. జాన్సన్‌ నాయక్‌ అసలు ఎస్టీనే కాదని అన్నారు. ఖానాపూర్‌ అభివృద్ధి కోసం తాను ఎంతో కృషి చేశానని.. అలాంటిది తనకు టికెట్‌ ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఖానాపూర్‌లో తన సత్తా ఏంటో చూపిస్తానని అంటున్నారు రేఖా నాయక్‌. దాంతో.. ఆమె స్వతంత్రులుగా పోటీ చేస్తారని కొందరు.. ఇంకొందరు అయితే ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయపడుతున్నారు.

కాగా.. సోమవారమే రేఖానాయక్‌ భర్త కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో తన బాటలో రేఖానాయక్‌ నడుస్తారని.. ఖానాపూర్‌లో పోటీ చేసేందుకు వెనకాడరని.. కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ సంపాదిస్తారని పలువురు స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఖానాపూర్‌లో పోటీ చేయడం.. పార్టీ మారడం వంటి విషయాలపై తన అనుచరులు, ప్రజలతో సంప్రదించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు.

Next Story