షర్మిలకు షాక్.. తిరిగి వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  20 Feb 2024 12:14 PM GMT
mla alla ramakrishna reddy, return,  ycp, andhra pradesh,

షర్మిలకు షాక్.. తిరిగి వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఓవైపు టీడీపీ, జనసేన పార్టీలు అసెంబ్లీ ఎన్నికల కోసం కలిసి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు తీసుకుని.. ఆమె అన్నపై పోరాటానికి సై అంటున్నారు. ఈ క్రమంలోనే షర్మిలకు మద్దతుగా వైసీపీని వీడిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కానీ.. సీఎం జగన్‌ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఆయన చెల్లెలుకి షాక్‌ ఇచ్చారు. తిరిగి ఆళ్ల రామకృష్ణారెడ్డిని పార్టీలోకి రప్పించుకున్నారు.

నెల రోజుల క్రితమే ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే.. తాజాగా తాడేపల్లి నివాసంలో ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. మళ్లీ వైసీపీ పార్టీలో చేరారు. ఈ మేరకు సీఎం జగన్‌.. ఆళ్ల రామకృష్ణారెడ్డికి పార్టీలోకి ఆహ్వానం పలికారు. వైఎస్‌ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న తర్వాత ఆ పార్టీలో చేరిన వారిలో మొదటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే.. తనని షర్మిల పెద్దగా పట్టించుకోవడం లేదన్న బాధతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆళ్ల రామకృష్ణారెడ్డితో సంప్రదింపులు జరిపారు. తిరిగి వైసీపీలో చేరేలా చర్చలు కొనసాగించారు. ఇక చివరకు ఆళ్ల నిర్ణయం మార్చుకోవడంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. ఏపీలో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌ జోష్‌ కనిపిస్తోంది.. తాజాగా ఆళ్ల నిర్ణయం ఏపీ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చినట్లు అయ్యింది.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్కే.. తాను వైఎస్‌ఆర్‌ కుటుంబం భక్తుడిని అని చెప్పారు. అందుకే వైసీపీని వీడిన తర్వాత షర్మిల పార్టీలో చేరినట్లు వెల్లడించారు. ఏపీలో కాంగ్రెస్ నేతలు వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకోవడం.. ఆయన పాలనను విమర్శించడంతో పాటు ప్రభుత్వాన్ని దింపేయాలన్న ఆలోచనలో ఉన్నారని అన్నారు. అందుకే జగన్‌కు అండగా ఉండాలనే ఉద్దేశంతో తిరిగి వైసీపీలో చేరినట్లు చెప్పారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. మంగళగిరిలో వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందని దీమా వ్యక్తం చేశారు.

Next Story