బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. హస్తం పార్టీలో చేరిన ఎమ్మెల్యే

బీఆర్ఎస్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యే షాక్‌ ఇచ్చారు. రేవంత్‌రెడ్డి సమంక్షలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  24 Nov 2023 2:15 PM IST
MLA Abraham, resign brs,  congress, revanth,

బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. హస్తం పార్టీలో చేరిన ఎమ్మెల్యే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే ప్రధాన పార్టీలు అన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మూడోసారి అధికారం కోసం బీఆర్ఎస్‌ ప్రయత్నాలు చేస్తుంటే.. ఎలాగైనా కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించాలని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్‌ దక్కని వారు.. పార్టీలపై అసంతృప్తి ఉన్నవారు ఇదే సమయంగా భావించి మరోపార్టీ కండువాలను కప్పుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యే షాక్‌ ఇచ్చారు.

అలంపూర్‌ నియోజకవర్గ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమంక్షలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అబ్రహంను కాంగ్రెస్‌ పార్టీలోకి రేవంత్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. అబ్రహం కాంగ్రెస్‌లో చేరడంతో అలంపూర్‌ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. అయితే.. అలంపూర్‌ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహంను తొలుత బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో అబ్రహంను మార్చి.. ఆయన టికెట్‌ను చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి కేటాయించారు.

ముందుకు టికెట్‌ ఇచ్చి.. ఆ తర్వాత మళ్లీ వెనక్కి లాక్కోవడంతో బీఆర్ఎస్‌ పార్టీపై ఎమ్మెల్యే అబ్రహం అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అబ్రహం బీఆర్ఎస్‌ను వీడి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అలంపూర్‌ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అబ్రహం. 2009లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రసన్నకుమార్‌పై గెలిచారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా ఉన్న పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే.. 2014లో మాత్రం టీడీపీ టికెట్‌పై పోటీ చేసిన అబ్రహం.. కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌కుమార్‌ చేతిలో ఓడిపోయారు.

Next Story