షర్మిల ఏపీకి రావడమంటే.. నాన్‌లోకల్‌ పొలిటిషియన్ వచ్చినట్లే: మంత్రి రోజా

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  23 Jan 2024 8:15 AM GMT
minister roja, comments,  sharmila, congress,

 షర్మిల ఏపీకి రావడమంటే.. నాన్‌లోకల్‌ పొలిటిషియన్ వచ్చినట్లే: మంత్రి రోజా

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాబోయే కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను వైఎస్ షర్మిలకు అప్పగించింది. దాంతో.. ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. మరోవైపు సీనియర్ నేతలు, యువత నేతలను కొలుపుకొని అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యే చర్యల్లో మునిగిపోయారు. అయితే.. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రావడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సజ్జల కూడా షర్మిల రాకపై విమర్శలు చేశారు. తాజాగా మంత్రి రోజా షర్మిల ఏపీలో ఎంట్రీ ఇవ్వడంపై ఫైర్ అయ్యారు.

షర్మిల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి రావడం అంటే.. మరో నాన్‌లోకల్‌ పొలిటీషియన్ వచ్చినట్లే అని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. వైఎస్సార్ చనిపోయిన తర్వాత పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి.. జగన్‌ను కాంగ్రెస్‌ పార్టీ 16 నెలల పాటు జైల్లో పెట్టించిందని అన్నారు. అలాంటి కాంగ్రెస్‌ పార్టీలో షర్మిల చేరడం ఏంటో అని రోజా వ్యాఖ్యానించారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు అడిగే హక్కు కూడా లేదన్నారు మంత్రి రోజా. ఎంత మంది వచ్చిన జగన్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడి పనిచేశారనీ.. సంక్షేమ పథకాలే వైసీపీకి అండగా ఉంటాయని మంత్రి రోజా అన్నారు.

నగరి నియోజకవర్గంలోని వడమాలపేటలో స్విమ్స్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్‌ పింక్‌బస్ క్యాంపును మంత్రి రోజా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. షర్మిల ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంపై స్పందించారు. ఇక నగరి నియోజకవర్గంలో 14వ సారి పింక్‌ బస్‌ క్యాంప్ నిర్వహించి మహిళల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి రోజా చెప్పారు. ఇంటికి దీపం ఇల్లాలు అనీ.. ప్రతి ఇంట్లో ఉన్న మహిళా ఈ పరీక్షలు చేయించుకోవాలన్నారు. సీఎం జగన్ పాలనలో విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి రోజా చెప్పారు.

Next Story