కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు.. ఈ ప్రూఫ్‌ సరిపోదా?: కేటీఆర్

సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్‌ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడి ఘటన సంచలనంగా మారింది.

By Srikanth Gundamalla  Published on  31 Oct 2023 6:16 AM GMT
minister ktr, tweet, attack, prabhakar reddy, rahul,

  కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు.. ఈ ప్రూఫ్‌ సరిపోదా?: కేటీఆర్

సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్‌ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడి ఘటన సంచలనంగా మారింది. ఇది రాజకీయ హత్యాయత్నమే అంటూ బీఆకర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం తీవ్రంగా గాయపడ్డ కొత్త ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్ యశోద ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు దాడికి పాల్పడిన రాజుని సంఘటనాస్థలిలో బీఆర్ఎస్‌ కార్యకర్తలు చితకబాదడంతో.. తీవ్రగాయాల పాలయ్యాడు. దాంతో.. అతడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి బీఆర్ఎస్‌ అగ్రనాయకులంతా పరామర్శించారు. ముందుగానే మంత్రి హరీశ్‌రావు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఆ తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్వయంగా వచ్చి ఆస్పత్రిలో కొత్త ప్రభాకర్‌రెడ్డిని కలిసి వెళ్లారు. ఈ క్రమంలో కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి తీవ్రం అవ్వకుండా అడ్డుకున్న గన్‌మెన్లకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. చేతులెత్తి నమస్కారం చేశారు. అయితే.. దాడిని ఆపే క్రమంలో గన్‌మెన్‌ చేతికి తీవ్ర గాయం అయ్యింది. ఒక వేళ అతను నిందితుడిని ఆపకపోయి ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

అయితే.. ఈ దాడి ఘటనను బీఆర్ఎస్‌ నాయకులు రాజకీయ హత్యాయత్నంగానే భావిస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ట్వీట్‌ సంచలనంగా మారుతోంది. ప్రభాకర్రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్‌ గూండానే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ కండువాతో ఉన్న నిందితుడి ఫొటోలను మంత్రి కేటీఆర్ ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా షేర్ చేశారు. రాజకీయ హత్యాయత్నం అనడానికి ఇదే ప్రూఫ్ అంటూ పేర్కొన్నారు. అంతేకాదు.. ఇంకా ఆధారాలు కావాలా అంటూ రాహుల్‌ గాంధీని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

Next Story