పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  3 Nov 2023 11:46 AM GMT
minister harish rao, hot comments,  pawan kalyan,

పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణ ద్రోహి అని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు భోజనం చేయలేదని చెప్పారని గుర్తు చేశారు మంత్రి హరీశ్‌రావు. సంగారెడ్డిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన వస్తే తాను భోజనం మానేశానని చెప్పిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. ఇక్కడ బీజేపీతో జత కలుస్తోందని హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం పవన్‌తో బీజేపీ.. షర్మిలతో కాంగ్రెస్‌ జట్టు కడుతున్నాయని చెప్పారు. పవన్‌ కళ్యాణ్, షర్మిల ఇద్దరూ తెలంగాణ ద్రోహులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీశ్‌రావు. తెలంగాణ ఏర్పాటు అయితే భోజనం మానేశానన్న పవన్‌తో తెలంగాణ బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ఆయన ప్రశ్నించారు. అలాగే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూతురు షర్మిల అని.. ఆమె కాంగ్రెస్‌ వైపు ఉన్నారని చెప్పారు. తెలంగాణ ఇవ్వాలని మనం కొట్లాడితే ఇవ్వడానికి అది సిగరెట్టా..? బీడీయా..? అని వైఎస్‌ ఆనాడు చిన్నగా చేసి మాట్లాడారని గుర్తు చేశారు హరీశ్‌రావు. అంతేకాదు తాను బతికుండగా తెలంగాణ రానివ్వనని చెప్పారని అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్‌ కూతురు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతోందని అన్నారు హరీశ్‌రావు. అంతేకాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు లోలోపల కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారని తెలిసిందని.. ఓట్లు చీలవద్దనే టీడీపీ ఇక్కడ పోటీ చేయడం లేదంట అని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ వంటి స్ట్రాంగ్‌ లీడర్ ఉండగా.. మిగతా వారంతా మనెందుకు అన్నారు మంత్రి హరీశ్‌రావు.

కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ సారథ్యలోని జనసేన పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వెంటనే తెలంగాణ బీజేపీ ఆయన వద్దకు వెళ్లి పొత్తు కోసం చర్చించింది. దాంతో.. పొత్తులపై ఢిల్లీలోనూ జాతీయ నేతలతో భేటీ కొనసాగింది. కానీ.. సీట్ల విషయమే ఇంకా క్లారిటీ రాలేదు. జనసేన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తున్నది. ఇక వైఎస్‌ఆర్‌టీపీ పార్టీని స్థాపించిన షర్మిల.. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై చర్చలు జరిగాయి. కానీ.. అవి సఫలం కాలేదు. అంతలోనే ఎన్నికలు వచ్చాయి. తాజాగా, అసెంబ్లీ బరి నుంచి షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story