మెదక్ జిల్లాలో క్లీన్‌స్వీప్‌పై మంత్రి హరీశ్‌రావు ఫోకస్
ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్‌రావు క్లీన్ స్వీప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 12:31 PM ISTమెదక్ జిల్లాలో క్లీన్‌స్వీప్‌పై మంత్రి హరీశ్‌రావు ఫోకస్
తెలంగాణలో ఎన్నికల సమరానికి ప్రధాన పార్టీలు సిద్ధం అయ్యాయి. ప్రచారం జోరుగా సాగిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని అధికారపార్టీ బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు ఈసారి ఎలాగైనా కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించి అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ పూర్తిస్థాయిలో అభ్యర్థుల జాబితా విడదల చేయగా.. బీజేపీ కూడా జాబితా విడుదల చేసే పనిలో పడింది. అయితే.. ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్‌రావు క్లీన్ స్వీప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆయా నియోజకవర్గాల నేతలతో తరచూ మాట్లాడుతున్నారు. ఎక్కడేం జరుగుతోందనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే.. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్‌కు కంచుకోట అనే చెప్పాలి. ఎందుకంటే గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఉన్న మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు గాను 9 స్థానాలను గెలుచుకుంది. ఈ క్రమంలో ఈసారి 10కి పది స్థానాలను గెలవాలని మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాగా.. బీఆర్ఎస్‌కు కొంత ఇబ్బంది ఉన్న మూడు నియోజకర్గాలపై హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి, జహీరాబాద్, మెదక్ స్థానాల్లో కాస్త ఇబ్బందులు ఎదురయ్యే చాన్స్ ఉందని గ్రహించి.. ప్రత్యేక వ్యూహ రచనలు చేస్తున్నారు మంత్రి హరీశ్‌రావు.
జహీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మానిక్‌రావు మరోసారి టికెట్ దక్కించుకున్నారు. ఆయనపై నియోజకవర్గంలో కొంతమేర వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో.. ఆయన్ని తప్పించి మరొకరికి బీఆర్ఎస్ టికెట్ కేటాయిస్తుందని భావించారు. కానీ.. అధిష్టానం మరోసారి మాణిక్‌రావుకే అవకాశం కల్పించింది. దాంతో కొందరు పార్టీని వీడారు.. మరికొందరు పార్టీలో ఉన్నా మాణిక్‌రావు మద్దతు ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలన్ని గమనిస్తోన్న మంత్రి హరీశ్‌రావు జహీరాబాద్ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. మాణిక్‌రావు గెలుపు కోసం అందరూ కృషి చేయాలని.. పార్టీ ముఖ్యమంటూ కార్యకర్తలకు పలు సూచనలు చేస్తున్నారు.
ఇక మెదక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికే మరోసారి టికెట్ వచ్చింది. అయితే.. మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి కుమారుడు రోహిత్ పోటీలో ఉన్నారు. ఎలాగైనా మైనంపల్లి దీమాను ఓడించాలనే లక్ష్యంతో మంత్రి హరీశ్‌రావు ఇక్కడా వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీని కాదనుకున్న వారికి తగిన బుద్దిచెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. మైనంపల్లికి బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కినా తన కుమారుడికి కూడా టికెట్‌కేటాయించాలనే డిమాండ్‌తో పార్టీని వీడిన సంగతి తెలిసిందే.
సంగారెడ్డిలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఇక్కడే మరోసారి టికెట్ దక్కించుకున్నారు. ఈసారి కూడా సంగారెడ్డిలో జగ్గారెడ్డి, చింతా ప్రభాకర్ మధ్యే పోటీ జరగబోతుంది. ఈ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా గులాబీ జెండా ఎగరేయాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. దాంతో.. అధిష్టానం సూచనల మేరకు సంగారెడ్డిలో బీఆర్ఎస్ గెలుపు కోసం మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. ఆయా పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరికలు జరిగేలా చూస్తున్నారు. బలం మరింత పెంచుకుని మెదక్ జిల్లాలో 10కి పది నియోజకవర్గాలను గెలిచి.. క్లీన్ స్వీప్ చేయాలని మంత్రి హరీశ్‌రావు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.