మా ప్రభుత్వంపై మగాళ్లకు కోపం ఉంది: మంత్రి ధర్మాన
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 10 March 2024 11:19 AM ISTమా ప్రభుత్వంపై మగాళ్లకు కోపం ఉంది: మంత్రి ధర్మాన
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో ఉమ్మడిగా పోటీ చేసేందుకు బీజేపీ, టీడీపీ, జనసేన నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే తొలి విడత అసెంబ్లీ స్థానాలకు టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా బీజేపీ ఈ పొత్తులో భాగస్వామ్యం అయ్యింది. త్వరలోనే వీరి మధ్య సీట్ల పంపకాలపై చర్చ కొలిక్కి రానుంది. మరోవైపు అధికార పార్టీ వైసీపీ కూడా తమ వ్యూహాల్లో ఉంది. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సాఆర్ చేయూత నగదు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ధర్మాన. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. తమ ప్రభుత్వంపై మగాళ్లకు కోపం ఉందని చెప్పారు. దానికి కారణాన్ని కూడా మంత్రి ధర్మాన వివరించారు. తమ ప్రతి అవసరాలకు డబ్బులు తమ భార్యలను అడగాల్సి వస్తోందనీ అందుకే వైసీపీ సర్కార్‌పై మగవారికి కోపం ఉందని అన్నారు. వారు అసంతృప్తితో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని చెప్తుంటారు కానీ.. వారి మాటలు మహిళలు వినొద్దని కోరారు. వైసీపీకి ఓటు వేసి మరోసారి జగనన్నను సర్కార్‌ను గెలిపించాలని కోరారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళా సంక్షేమం కోసం పనిచేస్తోందని అన్నారు మంత్రి ధర్మాన. అందుకే పురుషులకు వైసీపీ ప్రభుత్వంపై అక్కసు ఉందని అన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇదే చివరి అధికారిక సమావేశం అని చెప్పారు. అధికారులతో ఏర్పాటు చేసే సమావేశాలు తర్వాత ఉండవని మంత్రి ధర్మాన అన్నారు.