వాళ్లే దండుపాళ్యం బ్యాచ్‌.. దోచుకోవాలని చూస్తున్నారు: అంబటి

పవన్‌ కళ్యాణ్ సహా ప్రతిపక్ష నేతలపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  13 Aug 2023 11:57 AM GMT
Minister, Ambati Rambabu,  pawan, chandrababu,

వాళ్లే దండుపాళ్యం బ్యాచ్‌.. దోచుకోవాలని చూస్తున్నారు: అంబటి

ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యలో సినిమాల గురించి కూడా ప్రస్తావన తీస్తున్నారు. దాంతో.. ఏపీ పాలిటిక్స్‌ రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. బ్రో సినిమాలో తనని వక్రీకరిస్తూ క్యారెక్టర్‌ను పెట్టారని పవన్‌ కళ్యాణ్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు మంత్రి అంబటి రాంబాబు. నేరుగా తమను ఏం చేయలేక సినిమాల్లో వక్రీకరిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. మరోసారి పవన్‌ కళ్యాణ్ సహా ప్రతిపక్ష నేతలపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు మంచి చేస్తోన్న వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్‌ శృతి మించి విమర్శలు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. వారాహి ఎక్కి పిచ్చి కూతలు కూస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ తన కోసం రాజకీయాల్లోకి రాలేదని.. చంద్రబాబుని సీఎం చేసేందుకే పవన్ ఉన్నాడంటూ ఆరోపణలు చేశారు. ఇక వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్‌తో పాటు చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేశామని.. ఇంటింటికీ తిరిగి సంక్షేమాన్ని అందిస్తున్నామని మంత్రి అంబటి చెప్పారు. చంద్రబాబు, నారా లోకేశ్, పవన్‌ కళ్యాణే దండుపాళ్యం బ్యాచ్‌ అంటూ విమర్శించారు. ఎలాగైనా అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని మరోసారి దోచుకోనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు మంత్రి అంబటి.

పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడు ఏం చేస్తారో ఆయనకే క్లారిటీ లేదని విమర్శలు చేశారు. జనసేనానిగా వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. దీన్ని చూస్తేనే అర్థం అవుతోంది.. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడని అంబటి అన్నారు. జనసేన కార్యకర్తలారా మీ భవిష్యత్‌ను చూసుకోండంటూ సూచించారు. విశాఖపై పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయడం సరికాదు అన్నారు. నిబంధనల ప్రకారమే అన్ని నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఇక పవన్‌ ద్రోహం చేశారంటూ ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ స్వయంగా చెప్పారని.. భర్త ఎలాంటి వాడైనా సపోర్ట్‌ చేస్తారని పేర్కొన్నారు. భార్యకే ద్రోహం చేసిన పవన్ కళ్యాణ్.. ఇక రాష్ట్రాని ద్రోహం చేయరా? అంటూ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Next Story