టీడీపీ-జనసేన పొత్తు అట్టర్‌ ఫ్లాప్: మంత్రి అంబటి

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా కనిపిస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  29 Feb 2024 1:15 PM GMT
minister ambati, comments,  pawan kalyan,

 టీడీపీ-జనసేన పొత్తు అట్టర్‌ ఫ్లాప్: మంత్రి అంబటి 

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా కనిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్‌ గురువారం సీఎం జగన్‌తో పాటు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దానికి దీటుగా సమాధానం చెబుతున్నారు వైసీపీ మంత్రులు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. టీడీపీ, జనసేన పొత్తు అట్టర్‌ఫ్లాప్‌ అయ్యిందని విమర్శించారు.

తాడేపల్లిగూడెం సభతో అసలు ఏం సందేశం ఇచ్చారని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. జెండా సభకు జనాలు రాకపోవడంతోనే ఆలస్యంగా మొదలుపెట్టారని అన్నారు. పవర్‌ స్టార్‌ అన్నారు కానీ.. ఆయన పవర్‌ షేరింగ్‌ గురించి ఏమీ మాట్లాడలేదని అన్నారు. సీఎం జగన్‌ను దూషించడం కోసమే సభను ఏర్పాటు చేసినట్లు ఉందని మండిపడ్డారు. జనసైనికుల చెవిలో పవన్‌ పూలు పెడుతున్నారని అన్నారు. అయితే.. పవన్‌ అంటే తనకూ గౌరవం ఉందన్నారు. ఆయన ఒక మంచి నటుడు.. కానీ రాజకీయాలకు పనికిరారంటూ విమర్శించారు. పిచ్చి డైలాగులు తప్ప.. ఏం చేస్తున్నారంటూ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాన్‌కు జగన్‌ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పవన్‌ తనని నమ్మిన పార్టీ కార్యకర్తలను మోసం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

చంద్రబాబుని జైల్లో పెడితే పవన్ బాధపడ్డారనీ అన్నారు. వంగవీటి రాధను హత్య చేసినప్పుడు పవన్‌కు బాధ కలగలేదా అని మంత్రి అంబటి ప్రశ్నించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారని మంత్రి అంబటి అన్నారు. సీఎం జగన్‌ ప్రజలకు చెప్పినవన్నీ చేసి చూపించారని అన్నారు. పవన్‌ కళ్యాణ్‌తో రాష్ట్రానికి వచ్చేది ఏమీ లేదనీ.. ఆయన ఆటలో అరటిపండు అంటూ మంత్రి అంబటి విమర్శించారు.

Next Story