టీడీపీ, జనసేన కలిసినా ఏమీ జరగదు: మంత్రి అంబటి
టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
By Srikanth Gundamalla
టీడీపీ, జనసేన కలిసినా ఏమీ జరగదు: మంత్రి అంబటి
రాజమహేంద్రవరంలో టీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు ఆ పార్టీల నాయకులు వెల్లడించారు. అంతేకాదు.. త్వరలోనే ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఆ తర్వాత ప్రచారం నిర్వహిస్తామని.. ఇంటింటికి వెళ్తామని తెలిపారు. టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ప్రతిపక్షాల సమన్వయ సమావేశంపై చురకలు అంటించారు.
రాజమహేంద్రవరంలో టీడీపీ - జనసేన సమన్వయ కమిటీ భేటీపై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి చురకలు అంటించారు. రాజమండ్రిలో పాత కలయికకు కొత్త రూపం అంటూ కామెంట్ చేశారు. తద్వారా గతంలోని మిత్రులే ఇప్పుడు మరోసారి కలిశారని అభిప్రాయం వ్యక్తం చేశారు మంత్రి అంబటి. అలాగే వీరిద్దరూ కలిసినా ఒరిగేదేమీ లేదన్నారు. జీరో ప్లస్ జీరు ఈక్వెల్ టు జీరో అనే వ్యంగాస్త్రాలు వేశారు. రాష్ట్రంలో వైసీపీకి ఎదురులేదని మంత్రి అంబటి దీమా వ్యక్తం చేశారు.
కాగా, టీడీపీ - జనసేన సమన్వయ కమిటీ భేటీలో పవన్ కల్యాణ్, లోకేశ్ పాల్గొన్నారు. నవంబర్ 1న ఇరుపార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణను ప్రకటించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల కోసం ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించారు. అలాగే ఈ సమావేశంలో మూడు తీర్మానాలు చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఒకటి, వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలను రక్షించాలని రెండో తీర్మానం, రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పోరాటం చేయాలని మూడో తీర్మానం చేశారు.