లోకేశ్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌.. పప్పు తీసుకొచ్చిన మంత్రి అమర్నాథ్

ఏపీలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. గిఫ్ట్‌లు ఇచ్చుకోవడం.. రిటర్న్‌ గిఫ్ట్‌లు ఇవ్వడం కూడా జరిగిపోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  20 Feb 2024 7:15 PM IST
minister amarnath, return gift, nara lokesh, andhra pradesh,

 లోకేశ్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌.. పప్పు తీసుకొచ్చిన మంత్రి అమర్నాథ్

ఏపీలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. విమర్శలు.. ప్రతివిమర్శలే కాదు.. సవాళ్ల వరకు వెళ్లాయి. తాజాగా గిఫ్ట్‌లు ఇచ్చుకోవడం.. రిటర్న్‌ గిఫ్ట్‌లు ఇవ్వడం కూడా జరిగిపోతున్నాయి. అనకాపల్లిలో శంఖారావం సభ నిర్వహించిన నారా లోకేశ్‌.. ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్‌కు కోడిగుడ్డును అవార్డుగా ప్రకటించిన విషయం తెలిసిందే. గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్‌ పరువు తీసిన గుడివాడ అమర్నాథ్‌కు గుడ్డుని బహుమతిగా పంపుతున్నట్లు చెప్పారు. తాజాగా నారా లోకేశ్‌గా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కౌంటర్‌ ఇచ్చారు. లోకేశ్‌కు రిటర్న్ గిఫ్ట్ పంపుతున్నట్లు చెప్పారు. ఏకంగా ఓ కుండలో ఒడికించిన పప్పుని తీసుకొచ్చి మరీ చూపించారు.

లోకేశ్‌కు శంఖారావం అని కూడా పలకడం తెలియదని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. లోకేశ్‌ కోడిగుడ్డు గిఫ్ట్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇదే అంటూ అమర్నాథ్‌ మట్టి కుండలో పప్పుని తెచ్చారు. ఉప్పు, కారం కలిపి సిద్ధంగా ఉంచామన్నారు. లోకేశ్ తనంతట తానుగా వచ్చినా సరే.. లేకపోతే తానే పంపిస్తానని అన్నారు. చంద్రబాబు, లోకేశ్‌లో పౌరుషం, రోషం రావాలనే పప్పులో ఉత్తరాంధ్ర ఉప్పు, కారం కలిపామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తాను అవినీతి చేసినట్లు, భూ ఆక్రమణలకు పాల్పడినట్లు నారా లోకేశ్ నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు.

పవన్‌ కళ్యాణే తనని ఏమీ చేయలేకపోయాడనీ.. లోకేశ్‌ ఏం చేస్తాడని మంత్రి అమర్నాథ్ ఫైర్ అయ్యారు. రెడ్‌ బుక్‌ మొదటి పేజీ తెరిచే అవకాశం కూడా చంద్రబాబు, లోకేశ్‌లకు రాదని విమర్శించారు. 2019లోనే టీడీపీ నేతలత కుర్చీలను మడతపెట్టామనీ.. రెడ్‌ బుక్‌ కూడా మడత పెట్టుకోవాల్సిందే అన్నారు. సిద్ధం సభల తర్వాత సీఎం జగన్‌కు ప్రజల మద్దతు ఎంత ఉందో అర్థమైందనీ.. మరోసారి ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే మద్దతు తెలుపుతారని మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.


Next Story