కడియం కుట్రలతోనే రాజయ్యకు అన్యాయం: మంద కృష్ణ
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అండగా నిలబడ్డారు.
By అంజి Published on 29 Aug 2023 11:02 AM ISTకడియం కుట్రలతోనే రాజయ్యకు అన్యాయం: మంద కృష్ణ
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అండగా నిలబడ్డారు. ఇటీవల ప్రకటించిన బీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో డాక్టర్ రాజయ్యకు చోటు దక్కలేదు. రాజయ్యకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడం వెనుక కడియం శ్రీహరి కుట్రలు ఉన్నాయని మందకృష్ణ ఆరోపించారు. కడియం గుంట నక్క రాజకీయాలతోనే రాజయ్యకు అన్యాయం జరిగిందన్నారు. 99 శాతం ప్రజలు రాజయ్యను ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని అన్నారు. నియోజకవర్గంలో కడియం శ్రీహరిపై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. రాజయ్య పదవి పోవడానికి కడియమే కారణమని మండిపడ్డ మంద కృష్ణ మండిపడ్డారు.
ఇప్పుడు మళ్లీ టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. కడియంకు బీఫామ్ ఎలా వస్తుందో చూస్తామని అన్నారు. రాజయ్యకు టికెట్ ఇవ్వకపోతే మరొకరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014లో డాక్టర్ రాజయ్య డిప్యూటీ సీఎం పదవి నుంచి బర్తరఫ్ కావడానికి, ప్రస్తుతం బీఆర్‌ఎస్ టికెట్ రాకపోవడం వెనుక కడియం కుట్రలు ఉన్నాయని మంద కృష్ణ ఆరోపించారు. రెండు సందర్భాల్లో రాజయ్య మీద కేసీఆర్ చర్యలు తీసుకోడానికి కడియం సూత్రధారి అని అన్నారు.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం జరిగిన నియోజకవర్గస్థాయి మాదిగల అస్థిత్వం, ఆత్మగౌరవసభలో మందకృష్ణ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మాదిగల అస్థిత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాదిగలందరిపై ఉందన్నారు. ఇదిలా ఉంటే.. రాజయ్య సైతం సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా కడియం శ్రీహరిపై నిప్పులు కక్కుతున్నారు. తాను మొట్లు తీసి, దుక్కి దున్ని, నీళ్లు కట్టి వ్యవసాయం చేస్తే.. చివరకు ఎవరో వచ్చి కుప్పపై కూర్చుంటామంటే ఎలా అంటూ పరోక్షంగా కడియం శ్రీహరిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.