వీల్ ఛైర్ లోనే రోడ్ షో.. చెప్పినట్లే చేస్తున్న దీదీ

Mamata to Lead Huge Roadshow in Kolkata in Wheelchair Days After Suffering Leg Injury.ఎన్నికల ప్రచారాన్ని ఆపేది లేదనీ వీల్‌ చైర్‌లోనే ప్రజలను కలుస్తానని ప్రకటించిన మమత ఆదివారం కోల్‌కతాలో భారీ రోడ్‌షోకు హాజరయ్యారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 March 2021 4:24 PM IST
Mamata to Lead Huge Roadshow in Kolkata in Wheelchair Days After Suffering Leg Injury

కొందరు తోయడం వల్లే కాలు విరిగిందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు చేస్తూ ఉండగా.. బీజేపీ వారే దానికి కారణమని ఆమె పార్టీ నేతల ఆరోపణలు చేస్తున్నారు. మమత నాటకాలు ఆడుతున్నారని బీజేపీ ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) మాత్రం.. కారు డోరు తగలడం వల్లే ముఖ్యమంత్రి కాలికి గాయమైందని అంటున్నారు. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించారు. నందిగ్రామ్ లో నామినేషన్ దాఖలు చేశాక తిరుగు ప్రయాణంలో మమత కాలికి గాయమైన సంగతి తెలిసిందే.

కారు డోరు తెరచి.. నిలబడి అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా కారు డోరు అక్కడి స్తంభానికి తగిలి ఆమె కాలు నలిగినట్టు వీడియోల్లో కనిపించింది. ఆ వెంటనే ఆమె తనను నలుగురైదుగురు తోసేశారని ఆరోపించారు. కారు డోరు వల్లే మమత కాలికి గాయమైందని నివేదికలో పేర్కొన్నా.. అసలు కారు డోరు మమత కాలికి ఎలా తగిలిందన్నది మాత్రం వెల్లడించలేదు. ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో అక్కడ చాలా మంది గుమిగూడారని పేర్కొంది. ఆమె ప్రయాణిస్తున్న కారుకు ఓ ఇనుప స్తంభం అతి చేరువలోనే ఉందని చెప్పింది.

గాయమైనా కూడా ప్రచారంలో పాల్గొంటానని ఇప్పటికే చెప్పిన దీదీ అనుకున్నది చేసి చూపించారు. ఎన్నికల ప్రచారాన్ని ఆపేది లేదనీ వీల్‌ చైర్‌లోనే ప్రజలను కలుస్తానని ప్రకటించిన మమత ఆదివారం కోల్‌కతాలో భారీ రోడ్‌షోకు హాజరయ్యారు. నందిగ్రామ్‌లో ప్రచారం సందర్భంగా గాయపడిన మమతా నాలుగు రోజుల తరువాత,తొలి బహిరంగ కార్యక్రమానికి వీల్ చైర్ లో హాజరయ్యారు. తనకు ఇంకా నొప్పి ఉందని.. కానీ ప్రజల బాధలు ఇంకా ఎక్కువగా భావిస్తున్నానన్నారు. తన పవిత్ర భూమిని రక్షించుకునే ఈ పోరులో చాలా బాధలు పడ్డాం.. ఇంకా పడతాం.. కానీ పిరికిపందలకు తలొగ్గేది లేదని దీదీ వ్యాఖ్యలు చేశారు


Next Story