చంద్రబాబుని చంపేస్తామని వైసీపీ నేతలు అంటున్నారు: నారా లోకేశ్
చంద్రబాబు చనిపోవాలనీ.. ఆయన్ను చంపేస్తామని బాహాటంగానే వైసీపీ నేతలు చెబుతున్నారని నారా లోకేశ్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 11:15 AM GMTచంద్రబాబుని చంపేస్తామని వైసీపీ నేతలు అంటున్నారు: నారా లోకేశ్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏపీ స్కిల్ డెలప్‌మెంట్ స్కీం కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే.. శనివారం చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు ఆయన తనయుడు నారా లోకేశ్. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వ్యక్తిగత కక్షతనే వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుని అరెస్ట్ చేయించిందని అన్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేసి నేటికి 50 రోజులు పూర్తవుతున్నాయని.. ఆయన ఏ తప్పూ చేయకపోయినా కక్షతోనే ప్రజల మధ్యకు రానీయకుండా కుట్రలు చేస్తున్నారంటూ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో నారా లోకేశ్, భువనేశ్వరితో పాటు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు.
ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులకు నారా లోకేశ్ సవాల్ విసిరారు. స్కిల్, ఫైబర్ నెట్ కేసుల్లో ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. స్కిల్ కేసుతో ఎలాంటి సంబంధం లేని తన తల్లిని కూడా జైలుకు పంపిస్తామని మంత్రి రోజా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నిజం గెలివాలి పేరుతో నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తుంటే అరెస్ట్ చేస్తామంటారా అని ప్రశ్నించారు. అయితే.. 50 రోజులకు పైగా చంద్రబాబుని జైల్లో ఉంచి వైసీపీ నాయకులు ఏం సాధించారని లోకేశ్ అన్నారు. ఒక్క ఆధారాన్ని కూడా ప్రజలు, కోర్టు ముందు ఉంచలేకపోయారని అన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తన కుటుంబ సభ్యులు, మిత్రుల పాత్ర లేదని నారా లోకేశ్ స్పష్టం చేశారు.
'రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోయేందుకు కష్టపడడం సహజమే కానీ చంద్రబాబు చనిపోవాలనీ.. ఆయన్ను చంపేస్తామని బాహాటంగానే వైసీపీ నేతలు చెబుతున్నారంటూ నారా లోకేశ్ అన్నారు. మరో వైపు ఏపీలో ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు లోకేశ్. 32 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారని అన్నారు. వైసీపీ నేతలు బస్సు యాత్ర పేరుతో గాలి యాత్ర చేస్తున్నారంటూ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ మండిపడ్డారు. అలాగే ఏపీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, సైకో జగన్ ను వదిలిపెట్టమని, ప్రజల తరఫున పోరాడతామని లోకేశ్ స్పష్టం చేశారు. జైల్లో ఉన్న చంద్రబాబు భద్రతపై ఆందోళనగా ఉందన్నారు. జైలు పరిసరాల్లో డ్రోన్లు ఎగురుతున్నాయ్నారు.