Kotamreddy Giridhar Reddy : సైకిల్‌ ఎక్కనున్న కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి.. నేడు చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరిక‌

కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి శుక్ర‌వారం చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో తెలుగు దేశం పార్టీలో చేర‌నున్నారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 March 2023 10:43 AM IST
Kotamreddy Giridhar Reddy, TDP

సైకిల్‌ ఎక్కనున్న కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి

వైసీపీ రెబ‌ల్ నేత‌, నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి సోద‌రుడు గిరిధ‌ర్ రెడ్డి నేడు(శుక్ర‌వారం) తెలుగుదేశం పార్టీ(టీడీపీ)లో చేర‌నున్నారు. నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం తాను టీడీపీలో చేరుతున్నాన‌ని తెలిపారు. త‌న‌కు అంతా మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్ ఫ్లెక్సీల‌ను న‌గ‌రం అంతా ఏర్పాటు చేశారు.

ఈ ఉద‌యం నెల్లూరులో భారీ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించి అమ‌రావ‌తికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మ‌ధ్యాహ్నాం రెండు గంట‌ల త‌రువాత చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో గిరిధ‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

వైసీపీ నేత అయిన గిరిధర్‌రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. అయితే ఆయన సోదరుడైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గత కొంత కాలంగా వైసీసీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. తన ఫోన్ ట్యాప్ అయ్యిందంటూ ప్రభుత్వంతో పాటూ సొంత పార్టీపై ఆరోపణలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డితో పాటు గిరిధ‌ర్ రెడ్డి కొంత‌కాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు.

Next Story