ప్రశాంత్ కిశోర్‌ను పూర్తిగా వాడేశాం.. ఆయనేం చేయలేరు: కొడాలి నాని
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 24 Dec 2023 4:30 PM ISTప్రశాంత్ కిశోర్‌ను పూర్తిగా వాడేశాం.. ఆయనేం చేయలేరు: కొడాలి నాని
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఒక అవుట్ డేటెడ్ పొలిటిషన్ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌ను తీసుకొచ్చారనీ.. అయితే ఆయన రావడం వల్ల భూమి ఏమైనా బద్దలైపోతుందా అని ప్రశ్నించారు కొడాలి నాని. చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ కలిస్తే టీడీపీ ఏదేదో మాట్లాడుతున్నారనీ చెప్పారు. గతంలో ప్రశాంత్ కిషోర్‌ను తాము వాడుకున్నామనీ.. ఇప్పుడాయన్ని వాడుకోవడానికి ఏమీ లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.
ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయవ్యూహ కర్త అని అందరికీ తెలిసిన విషయమే. అయితే.. ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు తాజాగా సమావేశం అయ్యారు. దీనిపై స్పందించిన కొడాలి నాని.. చంద్రబాబు ఎంతమంది పీకేలను తెచ్చి పెట్టుకున్నా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరని అన్నారు. గతంలో ప్రశాంత్ కిషోర్‌ను తామూ పూర్తిగా వాడుకున్నామని అన్నారు. ఇప్పుడు పీకే బుర్రలో గుజ్జంతా అయిపోయింది.. చంద్రబాబు ఆయన్ని తెచ్చుకుని కొత్తగా చేసేదేమీ ఉండదంటూ విమర్శలు చేశారు. చంద్రబాబు గతంలో ప్రశాంత్ కిషోర్‌ను దారుణంగా తిట్టారనీ.. బీహార్ నుంచి వచ్చిన వ్యక్తి ఏ చేస్తాడని బూతులు మాట్లాడరని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు పీకేను ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. తాము తీవ్రంగా తిట్టిన విషయాలు టీడీపీ వారు ఎలా మరిచిపోయారంటూ కొడాలి నాని అన్నారు.
బాబాయ్‌ని చంపడానికి పీకేనే ప్లాన్ చేశారనీ.. జనాన్ని రెచ్చగొట్టడానికే కోడిత్తితో పొడిపించుకున్నారంటూ చంద్రబాబు ఏదేదో మాట్లాడరని కొడాలి నాని అన్నారు. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో చంద్రబాబు ఏం చేస్తారని అన్నారు. తన పీక కోసుకుంటారా అని ప్రశ్నించారు. పీకేకు ఐప్యాక్‌తో సంబంధమే లేదని అన్నారు. బెంగాల్ ఎన్నికలయ్యాక వ్యూహకర్తగా తప్పుకుని ఆయన రాజకీయ పార్టీ పెట్టుకున్నారని అన్నారు కొడాలి నాని. చంద్రబాబు ఒకవైపు పవన్ కళ్యాణ్‌ను అడ్డుపెట్టుకుని బీజేపీతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. మరోవైపు పీకేను పెట్టి కాంగ్రెస్‌తో కూడా చర్చలకు తెరలేపాడని ఆరోపించారు. చంద్రబాబుది రెండు కళ్ళ సిద్ధాంతం అని తెలిసిపోతుందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.