షర్మిల బహిరంగ సభ.. లక్ష మందితో కుదరదని తేల్చేశారు..!
Khammam police given permission for sharmila public meeting.తెలంగాణ రాష్ట్రంలో పార్టీ విషయమై వైఎస్ షర్మిల దూకుడుగా
By తోట వంశీ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ విషయమై వైఎస్ షర్మిల దూకుడుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆమె ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని అనుకున్నారు. ఏకంగా లక్షమందితో నిర్వహించాలని అనుకున్నా.. పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా చాలా తక్కువ మందితో బహిరంగసభ నిర్వహించాలని పోలీసులు సూచించారు.
ఏప్రిల్ 9న ఖమ్మంలో తొలి బహిరంగసభకు పోలీసులు అనుమతించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల ముఖ్యనేతలతో షర్మిల సమావేశం కానున్నారు. సభకు జనసమీకరణతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సంకల్ప సభ వాల్ పోస్టర్‌ను విడుదల చేస్తారు. ఈ సభను షర్మిల లక్ష మందితో నిర్వహించాలని భావిస్తే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 6,000 మందితో సభ నిర్వహించుకునేందుకు ఖమ్మం జిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు. సభలోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటలలోపే సభ నిర్వహించుకోవాలని పోలీసులు చెప్పారు. దీంతో ఈ సభకు ఎంత మందిని అనుమతిస్తారన్న విషయంపై సందిగ్ధత నెలకొంది.
ఈ సభలోనే పార్టీ పేరును, జెండాను, సిద్ధాంతాలను షర్మిల ప్రకటించనున్నారు. ఖమ్మం సభకు అనుమతించిన పోలీసులు కరోనా నేపథ్యంలో కొన్ని షరతులు విధించారు. సభకు వచ్చే వారంతా శానిటైజర్లు తెచ్చుకోవాలని, మాస్కులు కచ్చితంగా ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి తాను ఎన్నికల బరిలోకి దిగుతానని షర్మిల తన అనుచరులతో చెప్పినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తన తండ్రి వైయస్సార్ కు పులివెందుల ఎలాగో... తనకు పాలేరు అలాగేనని ఖమ్మం జిల్లా నేతలతో ఆమె చెప్పినట్టు తెలుస్తోంది.