లోకేశ్ కోసం పవన్‌ను కూడా చంద్రబాబు మోసగిస్తారు: కేశినేని నాని
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పొరపాటున కూడా గెలవరని కేశినేని నాని చెప్పారు.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 8:00 AM GMTలోకేశ్ కోసం పవన్‌ను కూడా చంద్రబాబు మోసగిస్తారు: కేశినేని నాని
టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని నాని.. తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే.. వైసీపీ ప్రకటించిన జాబితాలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని బెర్త్ దక్కించుకున్నారు. తనకు సీటు కేటాయించిన సీఎం జగన్‌కు కేశినేని నాని ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబు విజయవాడ ద్రోహి అంటూ కేశినేని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పొరపాటున కూడా గెలవరని చెప్పారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా ఆయన జోస్యం చెప్పారు. టీడీపీ 54 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతున్నాయని కేశినేని నాని అన్నారు. ఇక విజయవాడ గురించి మాట్లాడిన కేశినేని నాని.. ఆటోనగర్ తనకు ఎంతో ఇష్టమైన ప్రాంతమని చెప్పారు. వాటర్ ట్యాంకుకు ఎంపీ లాడ్స్ నిధులతో పాటు, ఐలా నుంచీ అవినాశ్ సహకారంతో నిధులు వచ్చాయని చెప్పారు. సమర్ధులకు ఓటు వేయాలని.. తనని, అవినాశ్‌ను గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. అవినాశ్, తాను ఇద్దరూ కలిస్తే డబుల్ రిటైనింగ్ వాల్ వస్తుందని చెప్పారు.
టీడీపీ పార్టీ తనను మెడపట్టుకుని అవమానకరంగా బయటకు గెంటేసిందనే ఆవేదన వ్యక్తం చేశారు కేశినేని నాని. కానీ.. సీఎం జగన్ మాత్రం తనని అక్కున చేర్చుకుని సీటు కూడా ఇచ్చారని అన్నారు. చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. అలాగే విజయవాడను స్మశానం చేయాలని కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. విజయవాడకు ఎయిర్‌పోర్టు కూడా ఉండకూడదని చంద్రబాబు ఆలోచించారని మండిపడ్డారు. తాను అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని చెప్పారు.
ల్యాండ్ మాఫియాకు వెళ్లకుండా పాత అమరావతి నుంచి ప్లానింగ్ ఇస్తే బాగుండేదని కేశినేని నాని అన్నారు. ఇక అమరావతి ప్రాజెక్టు మరో 30 ఏళ్లు అయినా పూర్తవదని అప్పుడే చెప్పానని కేశినేని నాని గుర్తు చేశారు. భూమాఫియాతో చంద్రబాబు, లోకేశ్ రైతులను మోసం చేశారని అన్నారు. చంద్రబాబు విజయవాడ ద్రోహీ అన్నారు. అంతేకాదు.. చంద్రబాబు మోసం చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అనీ.. ఆయన లోకేశ్ కోసం పవన్ కళ్యాణ్‌ను కూడా చంద్రబాబు మోసం చేస్తాడని విమర్శించారు. పొరపాటున కూడా ఆయన గెలవరని కేశినేని నాని మరోసారి అన్నారు.