కవిత పార్టీ పేరులో 'తెలంగాణ'.. ప్రకటన ఎప్పుడంటే?
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంతంగా...
By - అంజి |
కవిత పార్టీ పేరులో 'తెలంగాణ'.. ప్రకటన ఎప్పుడంటే?
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది.తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన కవిత , ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం కొత్త వేదికను సిద్ధం చేసుకుంటున్నారు. మే నెల మొదటి వారంలో శుభ ముహూర్తం చూసుకుని పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటించనున్నట్టు వెల్లడించారు.
పార్టీ పేరులో "తెలంగాణ" అనే పదం ఖచ్చితంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇది ప్రాంతీయ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యమని సూచిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆమె తన ప్రాధాన్యతలను వివరించారు. మొదటి ఛాయిస్ - సిద్ధిపేట నుండి అని తెలిపారు. రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన నియోజకవర్గం సిద్ధిపేట. ఇది బిఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇక్కడి నుండి పోటీ చేయాలనుకోవడం ద్వారా ఆమె తన రాజకీయ బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
రెండవ ఛాయిస్ బోధన్ అని కవిత తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంపై కూడా ఆమె దృష్టి సారించారు. నిజామాబాద్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండటం, స్థానికంగా ఉన్న పట్టు ఆమెకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. కల్వకుంట్ల కవిత ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఆమె ప్రకటించబోయే పార్టీ పేరు ఏమిటి? సిద్ధాంతాలు ఎలా ఉండబోతున్నాయి? అనేది మే నెల మొదటి వారంలో తేలనుంది.