BRSలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్.. ఈటల కంటే గొప్పనేత అన్న కేసీఆర్
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గులాబీ కండువా కప్పుకున్నారు.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 4:19 PM ISTBRSలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్.. ఈటల కంటే గొప్పనేత అన్న కేసీఆర్
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన కారెక్కారు. అయితే.. కాసాని జ్ఞానేశ్వర్‌కు గులాబీ కండువా కప్పి సీఎం కేసీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాసానితో పాటు పలువురు నాయకులు కూడా బీఆర్ఎస్‌లో చేరారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దాంతో.. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తే పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టలేమని భావించారు. దాంతో.. పోటీకి దూరంగా ఉండటమే మేలని భావించారు.
అయితే.. టీడీపీ అధిష్టానం నిర్ణయంపై కాసాని జ్ఞానేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేస్తామని ఆయన భావించిన క్రమంలో అధిష్టానం నిర్ణయం తనకు నచ్చలేదు. దాంతో.. పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఈ రోజుల చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తనకు పాత మిత్రుడు కాసాని జ్ఞానేశ్వర్ అంటూ గుర్తు చేసుకున్నారు. కాసాని బీఆర్ఎస్‌లోకి ఎప్పుడో రావాల్సి ఉంది కానీ.. కాస్త ఆలస్యం అయ్యిందని చెప్పారు. బండ ప్రకాశ్‌తో పాటు కాసానికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు బీఆర్ఎస్‌లో చేరినందుకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు.
ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో రానున్న రోజుల్లో ముదిరాజ్ సామాజిక వర్గ నాయకులకు చాలా అవకాశాలు కల్పిస్తామన్నారు సీఎం కేసీఆర్. రాజ్యసభ, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు ఇలా ఎన్నో పదవులు వారిని వరించనున్నాయని చెప్పారు. ఆ సామాజిక వర్గానికి ప్రభుత్వ పరంగా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. రాజకీయంగాను ఇక మంచి అవకాశాలు కల్పించనున్నామని కేసీఆర్ అన్నారు. అయితే.. ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులు పార్టీ నుంచి వెళ్లినా అంతకంటే పెద్ద నాయకులు కాసాని, మిగతా నాయకులు.. అతని అనుచరులంతా బీఆర్ఎస్ కుటుంబంలోకి రావడంతో సంతోషంగా ఉందన్నారు సీఎం కేసీఆర్.
సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ చేరిన మాజీ టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్. pic.twitter.com/z7R6X2ybh9
— Newsmeter Telugu (@NewsmeterTelugu) November 3, 2023