రాజకీయం వంశపారంపర్యం కాదు: కర్ణాటక సీఎం
లోక్‌సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
By Srikanth Gundamalla Published on 24 March 2024 7:57 PM ISTరాజకీయం వంశపారంపర్యం కాదు: కర్ణాటక సీఎం
లోక్‌సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఎన్డీయే, ఇండియా కూటములతో పాటు ఇతర పార్టీలు కూడా లోక్‌సభ ఎన్నికల కోసం చురుగ్గా పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీల్లో అసంతృప్తులు తమ గళం వినిపిస్తున్నాయి. టికెట్స్ కేటాయింపుపై తాజాగా మాట్లాడిన కర్ణాటక సీఎం సిద్ధారామయ్య సంచలన కామెంట్స్ చేశారు.
అయితే.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణతో పాటు, ఐదుగురు మంత్రుల పిల్లలను కర్ణాటక నుంచి పోటీలో ఉంచారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాజకీయం వంశపారంపర్యం చేస్తున్నారనీ.. కాంగ్రెస్‌లో మొదట్నుంచి ఇదే ఆనవాయితీ వస్తోందని ఇతర పార్టీలు వేలెత్తిచూపిస్తున్నాయి. మంత్రుల పిల్లలు, బంధువులకు టికెట్లు ఇవ్వడం వంశపారంపర్య రాజకీయం కాదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య అన్నారు. ఓటర్ల సిఫార్సుల అంగీకారం కూడా అభ్యర్థులను ఎంచుకోవడానికి, వారికి టికెట్లు కేటాయించడానికి కారణం అవుతాయని ఆయన తెలిపారు.
నియోజకవర్గ ప్రజల సిఫార్సు మేరకే కాంగ్రెస్ తన అభ్యర్థులను ఎంపిక చేసిందని కర్ణాటక సీఎం సిద్ధారామయ్య చెప్పారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ కనీసం 20 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ కర్ణాటకలోనే 28 సీట్లు సాధిస్తామని పిచ్చిగా మాట్లాడుతోందనీ.. వారిలా తాము అబద్ధాలు చెప్పబోము అంటూ విమర్శలు చేశారు. ఇక బీజేపీ కర్ణాటకలో అన్ని సీట్లు సాధించలేదని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందనీ.. ఆ పథకాలే తమ అభ్యర్థులను గెలిపిస్తాయని కర్ణాటక సీఎం సిద్ధారామయ్య చెప్పారు.