కన్నా నియామకం.. కోడెల శివరాం ఫైర్
సత్తెనపల్లి ఇన్‌చార్జ్‌గా కన్నా లక్ష్మీనారాయణను నియమించడంపై కోడెల శివప్రసాద్ రావు కుమారుడు కోడెల శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Jun 2023 1:45 PM ISTకన్నా నియామకం.. కోడెల శివరాం ఫైర్
సత్తెనపల్లి ఇన్‌చార్జ్‌గా కన్నా లక్ష్మీనారాయణను నియమించడంపై కోడెల శివప్రసాద్ రావు కుమారుడు కోడెల శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తానని, తాను గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం ప్రాణాలిచ్చిన తన తండ్రి కోసం మహానాడులో ఐదు నిమిషాలు కేటాయించకపోవడం బాధ కలిగించిందన్నారు. పదవులు వస్తాయంటే ఒక పార్టీ, పదవులు ఇస్తామంటే మరో పార్టీ ఇలా మూడు పార్టీలు మారిన కన్నా లక్ష్మీనారాయణకు తన తండ్రికి పోలికేంటని ప్రశ్నించారు. అప్పట్లో ఇదే కన్నా టీడీపీ కార్యకర్తలను వేధించారని ఆరోపించారు శివరాం. తొలి నుంచి నమ్మకంగా పార్టీ కోసం ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా పర్వాలేదు గానీ అవమానించడం మాత్రం కరెక్ట్ కాదన్నారు. అవమానాలు, కష్టాలు తమ జీవితంలో భాగమైపోయాయన్నారు. చివరకు తన తల్లిని కూడా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును కలిసి కనీసం ఐదు నిమిషాల పాటు తమ ఇబ్బందులను వివరించాలని మూడేళ్లుగా ఎదురు చూస్తున్నామని కానీ అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదని అన్నారు. కోడెల ఆత్మీయుల కోసం భవిష్యత్తులోనూ తాను నిలబడుతానని చెప్పారు. వారి నిర్ణయం ప్రకారమే తానూ నడుచుకుంటానని చెప్పుకొచ్చారు.
కన్నా ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఎన్నికలకు మరికొన్ని నెలల సమయమే ఉండడంతో నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిల నియామకం చేస్తూ వస్తోంది టీడీపీ. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రేసులో జీవీ ఆంజనేయులు, కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణ కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే, టీడీపీ నాయకత్వం కన్నా వైపు మొగ్గు చూపించింది. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ రావును 20 వేలకు పైగా ఓట్ల తేడాతో అంబటి రాంబాబు ఓడించారు. కోడెల కన్నుమూసిన తరువాత ఆయన కుమారుడు శివరాంకు టికెట్ లభిస్తుందనే ఊహాగానాలు నడిచాయి. అయితే ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గం బాధ్యతలను మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించడం కోడెల వర్గానికి అసలు ఇష్టం లేదు.